ఫిబ్రవరిలో షర్మిల కొత్త పార్టీ.. ఆగని చర్చలు!

162

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నారా? ఏపీలో వైసీపీ కీలకంగా ఉన్నట్లే తెలంగాణలో కూడా షర్మిల మరో కొత్త పార్టీతో కీలకం కానున్నారా? ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందా అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో షర్మిల పేరు కొత్తగా వినిపిస్తుంది. చాలాకాలంగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ లేని షర్మిల త్వరలో తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ కానున్నారని ముమ్మర ప్రచారం జరుగుతుంది.

ఫిబ్రవరి నెలలో షర్మిల కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీనియర్ నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడైన గోనె ప్రకాష్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు చర్చకు తెచ్చారు. రాజశేఖర్ రెడ్డికి కొడుకు కంటే కూతురు మీదనే ఎక్కువ నమ్మకం ఉండేదన్న ప్రకాష్ షర్మిక దృఢమైన మనస్తత్వం గలవారిని కితాబిచ్చారు. జగన్ విజయంలో ఖచ్చితంగా షర్మిల వాటా ఉందన్న గోనె ప్రకాష్ ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్నారా అన్న అంశంపై నో కామెంట్స్ అనేశారు.

అయితే.. ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పార్టీతో షర్మిల రాజకీయాలలోకి వస్తారని.. అది ఫిబ్రవరిలో ఉండొచ్చని బలంగా చెప్పారు. అయితే.. అనంతరం షర్మిల పేరిట జగన్ సొంత వార్తా పత్రికలో ఒక ఖండింపు లేఖ ప్రచురణ చేశారు. రాజకీయ పార్టీ ఊహాగానాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఎక్కడా ఆమె ఖండించినట్లుగా వీడియోలు కానీ ఆమె మాట్లాడినట్లుగా కానీ లేదు. ఆ లేఖ ఆమెనే రాశారని నమ్మకం లేకనో లేక ఆమె నిజంగానే వైఎస్ సన్నిహితులైన తెలంగాణ నేతలకు అందుబాటులోనే ఉన్నారో కానీ ఆమె రాజకీయ పార్టీపై మాత్రం చర్చలు ఆగడం లేదు. కొద్దిరోజుల్లోనే పార్టీ ప్రకటన అని బలంగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా అంతటి నిర్ణయం తీసుకుంటారా? లేక అలానే అన్న చాటు చెల్లిగా ఉండిపోతారా అన్నది చూడాల్సి ఉంది.