Sharmila Political Party: సమావేశానికి వచ్చిన వారికి పరీక్ష పెట్టిన షర్మిల!

887

Sharmila Political Party: అసలే తెలంగాణలో రాజకీయం వేడి రాజుకుంటుంది. గత ఐదేళ్లలో టీఆర్ఎస్ కు తిరుగేలేదు అనుకుంటుండగా బీజేపీ అనూహ్యంగా పుంజుకొని సవాల్ గా మారితే.. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు యాత్రలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇప్పుడు వీరికి తోడు నేను కూడా వస్తున్నా అంటూ షర్మిల స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ సరికొత్త సమీకరణాలను లేవనెత్తుతుంది. షర్మిల కొత్త పార్టీలోకి వలస నేతలు ఎవరు.. ముందు నష్టం ఏ పార్టీకి.. షర్మిల తర్వాత తెలంగాణ రాజకీయాలలో సమీకరణాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు రాజకీయవర్గాలలో చర్చకు వస్తున్నాయి. అయితే సరిగ్గా షర్మిల కూడా ఇదే ప్రశ్నలపై అభిమానులకు పరీక్ష పెట్టారు.

గత కొద్దిరోజులుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నేతలతో సమావేశమవుతున్న షర్మిల శనివారం రోజున రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్‌కు వచ్చిన వారికి షర్మిల ఫీడ్ బ్యాక్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ అభిమానుల నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్న షర్మిల పలు రకాల ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని వైఎస్ అభిమానులకు అందించారు.

అందులో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చెప్పాలి.. వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు పడుతున్నారు.. మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి?.. అసలు పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్‌, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి.. తెలంగాణ సమాజం.. ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. వాటికి ఏం చెప్పాలి. బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే పోరాడాల్సిన సమస్యలేంటి? జిల్లా స్థాయిలో పోరాడాల్సిన సమస్యలు.. నియోజకవర్గ స్థాయిలో పోరాడాల్సిన అంశాలు.. పార్టీ బలపడటానికి, క్యాడర్ నిర్మించుకోవడానికి.. వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకురావాలంటే సలహాలేంటి అనే 11 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం ఇచ్చారట. ఇది చూసిన కొంతమంది అభిమానులు షాక్ కు గురైతే.. షర్మిల పార్టీపై కమిట్మెంట్ ను కొందరు ఆకాశానికి ఎత్తుతున్నారట.

Sharmila Political Party: సమావేశానికి వచ్చిన వారికి పరీక్ష పెట్టిన షర్మిల!