భారీ డంప్ స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

163

దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో మారణాయుధాలు, పేలుడు పదార్ధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంది. హైదరాబాద్ కేరళ నగరాల్లో పేలుడుకు ఉపయోగించే ముడి పదార్దాన్ని భారీ సంఖ్యలో పోలీసులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు దాచిన డంప్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో సిల్ధార్, రంజాటి, రౌసవాలిలో అనుమానాస్పద కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ బలగాలు, సీఆర్‌పీఎఫ్ కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో రెండు మ్యాగజైన్స్‌, 150 రౌండ్లతో కూడిన ఏకే 47, రాకెట్ లాంఛర్, 16 యుబీజీఎల్‌ గ్రెనేడ్లు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, రేడియో సెట్లను రహస్య స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు డంప్ ను సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

శాంతిగా ఉన్న పిర్‌ పంజల్‌ శ్రేణుల్లోని దక్షిణ ప్రాంతంలో అశాంతిని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని భద్రతా బలగాలు గుర్తించాయి. గత కొంత కాలంగా ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అశాంతిని రేకెత్తించి శునకానందం పొందాలని ఉగ్రవాదులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డంప్ ను అక్కడికి తరలించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై మహోర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

భారీ డంప్ స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు