నేను జగన్ ఆఫీసు నుండి మాట్లాడుతున్నా.. ఎంత మోసం.. ఎంత మోసం!

159

ఈ పాడు లోకంలో మోసగాళ్లకు కొదువేముంది చెప్పండి. ఎక్కడ ఏ చిన్న లింక్ దొరికినా అల్లుకుపోయి మన జేబులకు కన్నం వేసేస్తారు. అదే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కనుక మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఒకవైపు బ్యాంకులు.. సైబర్ క్రైమ్ విభాగాలు నెత్తి, నోరు బాదుకుని మోసపోవద్దు అని హెచ్చరించినా మోసగాళ్లు రోజుకో కొత్త రూట్ లో రెచ్చిపోయి జనాలను చిత్తు చేస్తున్నారు. తాజాగా ఒకేరోజు ఏపీలో ఇలాంటివే రెండు వెలుగులోకి వచ్చాయి. అవి రెండూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫీసు నుండి మాట్లాడుతున్నామనే చెప్పడం విశేషం.

కృష్ణాజిల్లా విజయవాడలోని గవర్నర్ పేటకు చెందిన తొండెపు చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్యారడైజ్ ఫర్నిషింగ్స్ పేరుతో బిజినెస్ చేస్తున్నారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి సీఎం పేషీలోని ఎకౌంట్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో కర్టెన్లు, వాల్ పేపర్లు కావాలని కోరాడు. ట్రూ కాలర్ లో చెక్ చేస్తే వచ్చిన నెంబర్ కూడా ప్రదీప్, సీఎం పేషీ ఎకౌంట్స్ సెక్షన్ అని రావడంతో చంద్రశేఖర్ అతడ్ని నమ్మాడు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి మీకు వెండార్ కోడ్ ఉందా అని అడగడంతో చంద్రశేఖర్ లేదని సమాధానమిచ్చారు. దానికి.. ఫోన్ చేసిన వ్యక్తి ఒక నెంబర్ ఇస్తాను చేసి మాట్లాడండి మీ పని చేస్తారని చెప్పాడు.

అతను ఇచ్చిన మరో నంబరుకు కాల్ చేయగా వెండార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలంటే రూ.20 వేలు అవుతుందని చెప్పాడు. చంద్రశేఖర్ అతనికి ఆ డబ్బు పంపించగా కాసేపటికి ప్రాసెస్ ఫెయిల్ అయిందని మరోసారి డబ్బు కడితే చేస్తానని చెప్పాడు. ముందు కట్టిన డబ్బు తర్వాత రోజు మళ్ళీ క్రెడిట్ అవుతుందని చెప్పడంతో నమ్మి మరోసారి నగదు పంపించారు. అంతే.. అప్పటి నుండి ముందు ఫోన్ చేసిన నెంబర్ కానీ.. అతను ఇచ్చిన నెంబర్ కానీ పనిచేయడంలేదు. దీంతో ఏం జరిగిందో అర్ధమైన చంద్రశేఖర్ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక.. అదే కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన మేడపాటి హిమబిందు అనే మహిళ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ఇటీవల చర్మవ్యాధితో బాధపడుతున్న బాలికకు చికిత్స కోసం సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన వ్యక్తి హిమబిందుకు ఫోన్ చేసి తన పేరు సురేష్ అని సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. బాలికకు సీఎం సహాయ నిధి నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామని.. అవి విడుదల కావాలంటే రూ.20వేలు ఖర్చవుతుందని చెప్పడంతో హిమబిందు ఆ నగదు డిపాజిట్ చేశారు. రెండోసారి ఫోన్ చేసి మరో రూ.20వేలు అడగడంతో హిమబిందు రివర్స్ అయ్యారు. అంతే ఆ ఫోన్ పనిచేయడం లేదు. మోసపోయిన బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

నేను జగన్ ఆఫీసు నుండి మాట్లాడుతున్నా.. ఎంత మోసం.. ఎంత మోసం!