మాయమవుతున్న రూ.2 వేలు.. అసలు ఎందుకిలా?

14113

పెద్ద నోట్ల రద్దు.. భారతదేశాన్ని కుదిపేసిన అంశమిదే. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే అందులో ఈ నోట్ల రద్దు పాత్ర కూడా ఉందని ఇప్పటికీ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్పేమాట. రాత్రికి రాత్రి తీసుకున్న పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో వెలికి తీసిన అవినీతి ధనం ఎంత.. ఈ నిర్ణయంతో అందిన ఫలితమేంటి? అంటే రాజకీయ పక్షాలు ఎవరికి వారు వితండవాదమే చేస్తాయి. తిండీ తిప్పలు మాని బ్యాంకుల ముందు నిలబడిన సామాన్య ప్రజల క్యూలు.. కనీసం రోజు వారీ ఖర్చులకు పదివేలు ఇప్పించండి మహా ప్రభో అని సిఫార్సులు చేయించుకున్న చిన్న చిన్న ఫ్యాక్టరీల అగచాట్లు ఇప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాడు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన నగదు చెలామణి చేయాలని భావించిన రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా రూ.రెండు వేల నోట్లను అందుబాటులోకి తెచ్చింది.

పాత రూ.500, రూ.1000 నోట్లు పోయి ఆ స్థానంలో కొత్త కొత్త రూ.500, 2 వేల నోట్లు వచ్చాయి. పింక్‌ కలర్‌లో… చిన్న సైజులో క్యూట్ గా ఉండే రెండు వేల నోటు అందరి చేతిలో తళతళలాడింది. అదే సమయంలో సామాన్య ప్రజల చేతిలోకి వచ్చిన ఆ నోటుకు చిల్లర దొరకడం కూడా కష్టమయ్యేది. కానీ… ఇప్పుడు అదే నోటు కానరాకుండా పోయింది. ఆ పింక్ నోటు ఇప్పుడు చూద్దామన్నా.. కనిపించకుండా పోతోంది. బ్యాంకుల్లో లేవు, ఏటీఎంల్లో కూడా 500, 100, 200 నోట్లు తప్ప 2 వేల నోట్లు రావడం లేదు. ఎక్కడో భారీ మొత్తంలో డబ్బు కనిపిస్తే ఆ కట్టలతో ఎక్కడో ఒక చోట తారస పడుతుంది తప్ప మరీ నల్లపూసగా మారిపోయింది. ఇంతకూ రెండు వేల నోటు ఏమయినట్టు. ఎందుకు కనిపించకుండా పోతున్నట్లు? ఈ నోటు విషయంలో అసలు ఏం జరుగుతున్నట్లు? బ్యాంకుల నుంచి బయటకెళ్లిన రెండు వేల నోటు తిరిగి బ్యాంకుకు చేరడం లేదు. రెండు వేల నోటు పుట్టిందే దాచుకోడానికి అన్నట్టుగా మారిపోయిందా అనిపిస్తుంది. 100 రూపాయలు, 200 నోట్లు, 500 నోట్ల మూటలు పెట్టుకునే కంటే… రెండు వేల నోట్ల కట్టలు ఈజీగా దాచుకునేలా మారడం వరమైంది. రెండు వేల నోట్లు చేతికందడమే ఆలస్యం… వెంటనే బీరువాల్లోకి చేరాల్సిందే తప్ప వాడకంలోకి రావట్లేదు.

అందుకే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కూడా ఈ గులాబీ నోటు మీద కాన్షన్ట్రేషన్ పెట్టాయి. ఇందులో భాగంగా ముందుగా ఆర్‌బీఐ రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది. దీంతో త్వరలో రెండు వేల నోట్ల రద్దు జరుగుతుందనే పుకార్ల అలజడి రేగింది. కానీ రెండు వేల నోటు మాత్రం కట్టవీడి బయటకు రానేలేదు. నల్లదనం జమ చేసుకునే వాళ్లంతా రెండు వేల నోటును బీరువా దాటి బయటకు వదలట్లేదు. దీంతో… రాను రాను రెండు వేల నోటు కనుమరుగవుతోంది. ఉన్న నోట్లు అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంటే.. కొత్త నోట్లు కూడా ముద్రణ కాకపోవడంతో కొత్త నోటు కనిపించడమే గగనమవుతుంది. అయితే.. ఇప్పుడు అసలు మొత్తం ఎన్ని రెండు వేల నోట్లున్నాయి? దేశ నగదులో ఈ పెద్ద నోట్ల వాటా ఎంత?.. పింక్ నోటు ఇలా మరుగున పడితే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? డిమాండ్, సప్లైలో ఈ నోటు ఆర్థిక వ్యత్యాసాన్ని చూపిస్తుందా? మరి ప్రభుత్వం ఈ నోటు తెచ్చిన కష్టాల నుండి ఎలా బయటపడుతుంది?

తాజాగా రెండు వేల నోటు.. దాని ముద్రణ తదితర అంశాలపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. రూ.2 వేల నోట్లను గత రెండేళ్లుగా అసలు ముద్రించడం లేదని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో రూ.2 వేల నోట్ల అంశంపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే 2018 మార్చి నాటికి 3362 మిలియన్ల రూ.2 వేల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. సంఖ్యా పరంగా చూస్తే మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంతో సమానం. అదే 2021 ఫిబ్రవరి 26 నాటికి 2499 మిలియన్లు మాత్రమే ఈ నోట్లు చెలామణిలో ఉండగా.. సంఖ్యాపరంగా ఈ వాటా 2.01 శాతం కాగా, విలువ పరంగా 17.78 శాతం మాత్రమే. అంటే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు భారీగా తగ్గిపోయాయని చెప్పుకోవాలి. మరి ఇంతగా పెద్ద నోట్లు తగ్గిపోతే ప్రజల అవసరాలు, ఆర్థిక వ్యత్యాసాలు ఎలా అనే అనుమానాలు రాకపోలేదు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్‌బిఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఠాకూర్‌ సమాధానమిచ్చారు. కేంద్ర వైఖరి.. మంత్రి చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే కొత్త నోట్లు రావడం ఇక కష్టమేనని తెలుస్తుంది. మరి బడా బాబుల పెట్టెలలోకి చేరిన పింక్ నోటు సంగతేంటి అంటే ఏమో భవిష్యత్తులో మరోసారి రద్దు నిర్ణయం వస్తుందేమో.. లేక ఇలానే ముద్రణ లేకపోతే కొన్నాళ్లకు అసలు ఆ నోటే ఉనికి లేకుండా పోతుందేమో..!

మాయమవుతున్న రూ.2 వేలు.. అసలు ఎందుకిలా?