RRR Update: జక్కన్నతో కలిసిన హాలీవుడ్ డైరెక్టర్‌ నిక్ పావెల్!

279

RRR Update: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా హీరోల మల్టీస్టారర్, బాహుబలి లాంటి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా అప్ డేట్ గురించి చిన్న వీడియో వచ్చినా అది రికార్డులను తిరగరాసే వ్యూస్ సొంతం చేసుకుంటుంది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కాగా అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ప్రతిసన్నివేశాన్ని చెక్కుతున్నాడు.

ఆ మాటకొస్తే ఒక్క తెలుగులోనే కాదు ఇండియాతో పాటు ఇతర దేశాలలో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. అందుకే బాలీవుడ్ నుండి కూడా నటీనటులను తీసుకున్న దర్శక, నిర్మాతలు ఒక్క క్లైమాక్స్ కోసమే హాలీవుడ్ నుండి దర్శకుడిని దింపేశారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ ఆర్ఆర్ఆర్ సెట్‌లో కాలు పెట్టాడు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ తన అధికారిక ట్విట్టర్ పేజీలో రాస్తూ.. ‘క్లైమాక్స్‌ గురించి ఎలాంటి అప్డేట్‌ రావడంలేదని భావిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్‌ ఇస్తున్నాం.. క్లైమాక్స్‌ కోసం పావెల్‌ వచ్చారు’ అంటూ అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తుండగా.. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించిన యూనిట్ ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉంది. క్లైమాక్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఉండనుందని బలంగా వినిపిస్తుంది.