Revanth Reddy: షర్మిలకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న రేవంత్!

10425

Revanth Reddy: తెలంగాణలో దీనావస్థకి చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రకంగా బూస్టింగ్ ఇచ్చి పైకి లేపాలని చూస్తున్న నేత రేవంత్ రెడ్డి. ఎంపీగా గెలిచిన తర్వాత హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా ఉంటున్న రేవంత్ కాంగ్రెస్ పార్టీకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు దక్కే ఛాన్స్ కూడా ఉందని చెప్పడంతో మరికాస్త దూకుడు పెంచిన రేవంత్ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ వాలిపోతున్నారు. తన వంతు సాయంగా ప్రచారం నుండి కీలక కసరత్తులు వరకు రేవంత్ రెడ్డి దగ్గరుండి చేసి పెడుతున్నారు. అయితే.. ఇదే ఆ పార్టీలో చాలా మంది సీనియర్లకు మింగుడుపడడం లేదు. కానీ రేవంత్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనను గెలిపిస్తే కాంగ్రెస్‌లో తన ఇమేజ్ మరింతగా పెరుగుతుందనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు వార్తలు వినిపిస్తుండగా అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థి, ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని కాసేపు పక్కనపెడితే రేవంత్ ఈ మధ్య కాలంలో టీవీ కార్యక్రమాలలో కానీ.. ప్రచారంలో కానీ వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇది ఒకరకంగా షర్మిలకు ఫ్రీ పబ్లిసిటీ అనేలా మారుతుందని ఒక రాజకీయ వర్గం చర్చలు చేస్తుంది. ఎందుకంటే షర్మిల పార్టీ గురించి తెలంగాణ పార్టీలు.. ఆ పార్టీల నేతలు పెద్దగా స్పందించడం లేదు. మీడియా వాళ్ళు ఒకటికి రెండు సార్లు అడిగితే ఏదో సమాధానం చెప్పాలి అన్నట్లుగా ఉంటున్నారు తప్ప పెద్దగా అటెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క రేవంత్ మాత్రం ఛాన్స్ వచ్చిన ప్రతిసారి షర్మిల పార్టీపై మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ పార్టీ షర్మిలను తీసుకొచ్చారని ఆ పార్టీలు ఆరోపిస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీని దబ్బతీసేందుకే బీజేపీ షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సామాజిక వర్గాల వారీ లెక్కలేసి కాంగ్రెస్ లో రెడ్డి సామజిక వర్గాన్ని ఆకర్షించి దెబ్బతీసేందుకే షర్మిలను తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇదే వాదన చేస్తూనే డ్రామాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టలేరని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల గురించి మంచి, చెడు ఏది మాట్లాడినా ఇప్పుడు అటెన్షన్ పెరుగుతుంది. అందుకే మిగతా నేతలు సైలెంట్ ఉన్నారు.

కానీ రేవంత్ మాత్రం షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. షర్మిల రెడ్డి వర్గాన్ని ఆకర్షిస్తుందనే టెన్షన్ కారణంగానే రేవంత్ రెడ్డి ఆమెపై విమర్శలు చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలలో ఒక టాక్ వినిపిస్తుండగా అనవసరంగా షర్మిలకు రేవంత్ రెడ్డే సీన్ ఇస్తున్నట్లుగా ఉందని మరికొందరు చర్చిస్తున్నారు. కారణం ఏదైనా.. షర్మిల విషయంలో రేవంత్ రెడ్డి స్పందించడం రాజకీయంగా వ్యూహాత్మకమైన చర్య కాదనే వాదన మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. మరి రేవంత్ అందరిలానే షర్మిల కొత్తపార్టీఫై మౌనంగానే ఉంటారా.. లేక అదే దూకుడుగా ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.