కేటీఆర్ కు ఆ ముగ్గురే శత్రువులు :- రేవంత్ రెడ్డి

164

మంత్రి కేటీఆర్ కు సొంత కుటుంబంలోనే ముగ్గురు శత్రువులు ఉన్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం కాకుండా ఆ ముగ్గురే అడ్డుకుంటారని తెలిపారు, హరీష్రావు, సంతోష్ రావు కవిత రావులకు కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కూడా కేటీఆర్ ను సీఎం చెయ్యడం లేదని, అతడు అసమర్థుడని కేసీఆర్ కు తెలుసనీ రేవంత్ వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. సీఎం ఎవరవుతారు అనేది కేవలం కల్వకుంట్ల కుటుంబ సమస్య మాత్రమేనని అన్నారు.

కేటీఆర్ సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనిపై కూడా రేవంత్ మాట్లాడారు. సీఎం మారితే తమకు మంత్రి పదవి వస్తుందని కొందరు ఆశపడుతున్నట్లు తెలిపారు. కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత లేదని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలకంటే కేటీఆర్ చెప్పే అబద్దాలే ఎక్కువగా ఉంటాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని సీఎం కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను సీఎం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

మరో వైపు కేటీఆర్ ఫిబ్రవరి లేదంటే మే సీఎం పీఠం అధిరోహించనున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మంచి ముహూర్తం చూసుకొని కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని సొంత పార్టీ నేతల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కేటీఆర్ సీఎం కావడాన్ని బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. పార్టీలో మొదనుంచి ఉండి తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన ఈటెల రాజేందర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, బీజేపీ బీసీ వర్గానికి చెందిన ఈటెలను ముఖ్యమంత్రి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది.

అసలు కేసీఆర్ వేరే వారిని ముఖ్యమంత్రిని చేయడం దేనికని మరికొందరు వాదిస్తున్నారు. 2023 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నారు ఆయన అభిమానులు. కేటీఆర్ కు పగ్గాలు ఇస్తే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అసంతృప్తి నేతలు పక్కపార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట టీఆర్ఎస్ సీనియర్లు. మరోవైపు బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. తమ పార్టీలో చేరేందుకు 30 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. తమతో టచ్ లో ఉన్నారని, ముఖ్యమంత్రి మారగానే వారంతా కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.

కేటీఆర్ కు ఆ ముగ్గురే శత్రువులు