ration door delivery: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!

590

ration door delivery: ఏపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనుకున్నా ఆచరణలో మాత్రం అవి బొక్క బోర్లా పడి ఎటూ కాకుండా పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం పర్యవసానాలను అంచనా వేయలేకపోవడమే అనే బలమైన ఫీలింగ్ రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో చెప్పేశారు. తొలుత జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెచ్చిన ఇసుక విధానం సమయంలో వచ్చిన సమస్యలను చూసైనా గుణపాఠం నేర్చుకోవాల్సింది. కానీ అప్పటికి ఇప్పటికీ మార్పు లేనేలేదేమో అనిపిస్తుంది. కొత్త పథకం ఎలా ఉంటుంది.. అమలు ఎలా అన్నది లేకుండా ఇసుక తవ్వకం ఆపేయడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం రోడ్డునపడింది. దాని ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు.

ఇసుక విధానం తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా వెనకా ముందు ఆలోచించకుండా చేసినవేనని స్పష్టంగా అర్థమైంది. ఇక రాష్ట్రంలో రేషన్ విధానానికి వస్తే.. ముందుగా సన్నబియ్యం అని ప్రకటన చేశారు. సరే చివరికి నాణ్యమైన బియ్యానికి ఫిక్స్ అయ్యారు. నోటి దురుసు మంత్రి తాము చెప్పిందే చేస్తున్నామని ప్రజలను కూడా ఒప్పించేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత 5,10 కేజీల సంచులు తెస్తామన్నారు. అందుకోసం రూ.700 కోట్లు విడుదల చేసినట్లుగా జీవోలు కూడా ఇచ్చారు. మరి ఆ సంచులు ఏమయ్యాయో అసలు తెచ్చారో లేదో కూడా తెలియదు.

చివరిగా రేషన్ డోర్ డెలివరీ ఇస్తామని ఆ బాధ్యత కూడా వాలంటీర్లే నిర్వహించాలని చెప్పారు. వాలంటీర్లు ఇప్పటికే వెట్టిచాకిరి చేస్తున్నామని గగ్గోలు పెట్టడంతో రేషన్ డోర్ డెలివరీ కోసం ఒక కొత్త విధానాన్నే తెచ్చారు. ఆ విధానం ప్రకారం ప్రతి 90 రేషన్ కార్డులకు రూ.16 వేలు వేతనం ఇచ్చి ఒకరిని నియమించారు. వారికి తొంబై శాతం లోన్ తో రూ.5.8 లక్షలకు ఒక వాహనాన్ని కూడా ఇచ్చారు. వారికి ఇచ్చే రూ.16 వేలలో ఒక కూలీని కూడా తీసుకోవాలని చెప్పారు. అంటే ఒక వాహనం, వాలంటీర్, వాహనం డ్రైవర్ కం ఓనర్, మరో కూలీ ఇంటింటికి తిరిగి రేషన్ ఇవ్వాలి.

Image result for ration door delivery vehicles miss use

అయితే.. రూ3.వేలకు కూలీలు ఎవరూ రాకపోవడంతో వాహనం కొనుక్కున్న వ్యక్తే డ్రైవరుగా కూలీగా మారి నడిపిస్తున్నారు. వాలంటీర్ రేషన్ ఇవ్వాల్సిన అడ్రెస్స్ చెప్పేసి సైలెంట్ అవుతున్నారు. ఇక రేషన్ డీలర్ దగ్గర నుండి సరుకు తూకం వేసి వాహనంలో లోడ్ చేసుకొని డెలివరీ చేసి సాయంత్రం మళ్ళీ మిగిలిన సరుకు డీలర్కు అప్పగించడం వరకు వాహనం నడిపే వ్యక్తిదే బాధ్యత కావడంతో వారికి భారం ఎక్కువైంది. ఇంత చేసినా వచ్చేది నెలకు 16 వేలు. పైగా సర్వర్లు మొరాయిస్తే ఇక అంతే సంగతులు.

అది కూడా ఆ వాహనాలు పట్టణాలలోని చిన్న సందులలోకి వెళ్లలేక వీధి చివరికి ఆగిపోతున్నాయి. అక్కడకి వచ్చే వాళ్ళు వస్తున్నారు.. లేదంటే రేపు తీసుకుంటామంటున్నారు. రేపు వాహనం మరో వీధికి వెళ్తే మళ్ళీ వెనక్కు రావాల్సి వస్తుంది. ఇలా బోలెడు కష్టాలు వాహన దారులకే వస్తున్నాయి. ఫలితంగా మాకొద్దు బాబోయ్ ఇది అంటూ వాహనాలు ప్రభుత్వానికే ఇచ్చేస్తాం మేము కట్టిన పదిశాతం రూ.58 వేలు నగదు వెనక్కి ఇచ్చేయాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం కేవలం పట్టణాలలోనే ఈ పథకం అమలులో ఉంది. పంచాయతీ ఎన్నికలు అయితే పల్లెల్లో కూడా మొదలు పెట్టాలి. కానీ ఇప్పటికే వాహనాలు తీసుకున్న వారు కొందరు వెనక్కు ఇచ్చేసి చేతులెత్తేస్తున్నారు. మరి ముందు ముందు ఎలా అవుతుందో చూడాలి!

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!