Rajyasabha: గుంటూరులో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి!

171

Rajyasabha: గుంటూరు అంటే మిర్చికి ఫేమస్. ఇక్కడ పండే మిర్చి పంట దేశవిదేశాలకు ఎగుమతవుతుంది. ముఖ్యంగా చైనా, మలేషియా, తైవాన్, జపాన్ లాంటి దేశాలకు మన మిర్చే ఆధారం. గుంటూరు నుండి నిత్యం ఇతర దేశాలకు మిర్చి ఎగుమతి అవుతూనే ఉంటుంది. ప్రపంచంలోనే గుంటూరు మిర్చికి ఇంత ప్రాధాన్యత ఉన్నా ఇప్పటికీ ఇక్కడ మిర్చి పంటపై పరిశోధన చేసే రాష్ట్ర, కేంద్ర సంస్థలు లేవు. కేంద్రంలో ప్రభుత్వాలు మారే ప్రతిసారి ఇదే అంశం తెరమీదకి రావడం.. తర్వాత కాలంలో అది మరుగున పడడం కామనైపోయింది.

కాగా..ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. మిర్చి పంటలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అత్యధిక మిర్చి పంట పండించే దేశం భారతదేశమని గుర్తుచేసిన ఆయన ప్రపంచ ఉత్పత్తిలో 40శాతం మిర్చి భారత్‌లో పండుతుందని.. దేశ ఉత్పత్తిలో ఏపీలోనే 40 శాతం మిర్చి లభ్యమవుతుందని అన్నారు.

మిర్చి పంటకు గుంటూరు ప్రధాన కేంద్రమని.. కొత్త వంగడాల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా మిర్చి పంట కోసం జాతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తే ఇక్కడ రైతులకు మరింత వెసులుబాటుగా ఉంటుందని.. అధిక దిగుబడులతో పాటు సరికొత్త వంగడాల ఆవిష్కరణకు ఇది కేంద్రమవుతుందని జీవీఎల్ చెప్పారు.

Rajyasabha: గుంటూరులో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి!