Polavaram Project: కేంద్రం నుండి వచ్చిందే కట్నం.. చెప్పిందే వేదం!

170

Polavaram Project: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలపై కొద్ది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొంతనలేని సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వంలో అంచనాలను పెంచి కేంద్రానికి సమర్పించగా సూత్రపాయంగా కొత్త అంచనాలకు ఒకే చెప్పిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ప్రస్తుతం మళ్ళీ పాత అంచనాల ప్రకారమే నిర్మాణ వ్యయాన్ని చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ఆ మధ్య ఇదే అంశంపై పలుమార్పు కేంద్ర జలశక్తి ప్రకటనలు చేసినా ఇప్పటి జగన్ ప్రభుత్వం పెంచిన అంచనాల ప్రకారం చెల్లించాలని పదేపదే కోరినట్లుగా చెప్పింది.

కానీ.. కేంద్రం మాత్రం పాత అంచనాలకు ఫిక్స్ అయింది. ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి కేంద్రం వెల్లడించడం విశేషం. 2013-14 నాటి ధరలకే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని పరిమితం చేసినట్లు కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంట్ సమావేశాలలో స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ఆర్థికశాఖ 2013-14 నాటి ధరలకే పరిమితం చేసిందని మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.

సవరించిన అంచనాల కమిటీ సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని.. ఏపీ విభజన చట్టం రూపొందించే సమయంలో ఈ ప్రాజెక్టును మేమే చేపడతామని భారత ప్రభుత్వం చెప్పింది. కేబినెట్‌ నోట్‌లో 2013-14 నాటి ధరల ప్రకారం అయ్యే ఖర్చును కేంద్రం సమకూరుస్తుందని చెప్పారు. నిర్మాణంలో జాప్యం, కొత్త ఆర్‌అండ్‌ఆర్‌ అంశాల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. దీనిపై సవరించిన అంచనాల కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఆర్థిక మంత్రిత్వశాఖ 2013-14 నాటి ధరల స్థాయికే పరిమితి (క్యాప్‌) విధించిందన్నారు. కేంద్రం రాబోయే రోజుల్లో సరైన సమయంలో, సరైన స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేపడుతుందని గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం పోలవరం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల 400 కోట్లను మాత్రమే కేంద్రం చెల్లించనుంది. అదే గత టీడీపీ ప్రభుత్వంలో 2017-18లో కేంద్రం ఆమోదించిన అంచనాల ప్రకారం రూ.55 వేల 550 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే. అయితే.. ఇక్కడే కేంద్రం తెలివి ప్రదర్శిస్తూ అప్పటి ధరలనే చెల్లిస్తామని చెప్తుంది. పెరిగిన ధరలు, పునరావాస వ్యయానికి పెరిగిన అంచనాల ప్రకారం 55 వేల కోట్లు కూడా పూర్తిగా చాలవని నిపుణుల అంచనా. కానీ కేంద్రం మాత్రం రాష్ట్ర విభజన సమయం నాటి అంచనాలే చెల్లిస్తామని తెగేసి చెప్తుంది. అది కూడా నానా కష్టాలతోనే విడతల వారీ చెల్లింపులు చేస్తుంది. మరి ఈ విధంగా ప్రాజెక్టు ఎలా.. ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి!

Polavaram Project: కేంద్రం నుండి వచ్చిందే కట్నం.. చెప్పిందే వేదం!