Petrol Price Rise: పెట్రో మంట.. సెంచరీ దాటినా ఆగని ధరలు!

239

Petrol Price Rise: దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ.వంద దాటినా పెట్రో మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. శనివారం వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.58, డీజిల్‌ ధర రూ.80.97కు చేరాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 38 పైసలు పెరగడంతో పెట్రోల్‌ ధర రూ.97కు, డీజిల్‌పై 39 పైసలు అధికమవడంతో రూ.87.06కు చేరాయి. కాగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఇప్పటికే రూ.100 దాటాయి. ఇక బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.67, డీజిల్‌ రూ.85.84కు చేరాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై 40 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.18, డీజిల్‌ రూ.88.31గా ఉన్నాయి. దేశంలో ఇప్పటికే పలు నగరాలలో సెంచరీ దాటి ఇంకా పైపైకి పాకుతూనే ఉన్నా చమురు కంపెనీలు మాత్రం ధరలను నియంత్రించడం లేదు.

అయితే.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ దేశీయ కంపెనీలు వినియోగదారులపై ఇంతగా భారం మోపడం ఏంటన్నది ప్రతిపక్షాల నుండి సామాన్య ప్రజల వరకు వినిపిస్తున్న ప్రశ్న. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యుడికి బ్రతుకు బండి లాగడం పెను సవాల్ గా మారగా అధికార పార్టీ మాత్రం ఇప్పటికీ గత ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పడం విస్తుపోయేలా చేస్తుంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే గత ప్రభుత్వాల వలనే ఇప్పటి పెట్రోల్ ధరలు అని విమర్శించడం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పుకోవాలి.

నిజానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు బ్యారెల్ ధర రూ.వంద నుండి రూ.130 వరకు ఉండగా అప్పుడు పెట్రోల్ ధర మాత్రం రూ.70 వరకు ఉండేది. కానీ ఇప్పుడు చమురు బ్యారెల్ ధర కేవలం రూ.30 నుండి రూ.45 మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలు మాత్రం సెంచరీ దాటేస్తున్నాయి. ప్రభుత్వం ధరల పెంపు కూడా ప్రజల శ్రేయస్సు కోసమేనని చెప్పడం విశేషం కాగా బిహార్‌ బీజేపీ నేత, మంత్రి నారాయణ ప్రసాద్‌ లాంటి వాళ్ళు ఏకంగా ప్రజలకు వచ్చిన నష్టం లేదు అలవాటు చేసుకుంటారని చేస్తున్న వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు చిర్రెత్తుకొనేలా చేస్తుంది.

Petrol Price Rise: పెట్రో మంట.. సెంచరీ దాటినా ఆగని ధరలు!