కర్నూలు జిల్లాలో పరువుహత్య కలకలం

66

వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతి, యువకులు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. తిరిగి సొంతూరికి వెళ్లిపోయారు. అక్కడే కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఆడం స్మిత్, అదే గ్రామానికి చెందిన మరో యువతి ప్రేమించుకున్నారు.

ఆడం స్మిత్ ఆదోనిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. సామాజిక వర్గాలు వేరుకావడం వల్లనే యువతి తల్లిదండ్రులు పెళ్ళికి సస్సేమిరా అన్నారు. దింతో ఇద్దరు ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ లో పెళ్లి చేసుకొని తిరిగి ఆదోనికి వెళ్లారు. అక్కడే కిష్టప్పనగర్ లో కాపురం పెట్టారు. ఆడం స్మిత్ రోజు ఆసుపత్రికి వెళ్లి వస్తుండేవాడు.

ఇవాళ విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా ఆదోని నగర శివార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. అయితే ఈ హత్యకు యువతి తల్లిదండ్రులే కారణమని ఆడం స్మిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడం స్మిత్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కర్నూలు జిల్లాలో పరువుహత్య కలకలం