మళ్లీ ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. తిరుపతి సీటు సంగతేనా?

107

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నేపధ్యంలో ఏపీలో ఇప్పుడు ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం సీటు విషయంలో ఇప్పటివరకు క్లారిటీగా లేవు. ఇరు పార్టీల నుంచి ఇప్పటికే సీటు మాకంటే మాకు అంటూ.. మేమే పోటీ చేస్తాం అంటూ ప్రకటించుకోగా.. ఎవరికెంత బలం ఉందో ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితిలో మరోసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

GHMC ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద నాయకులను కలిసేసి వచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు తిరుపతిలో మేమే పోటీ చేస్తున్నాం అంటూ ప్రకటించగా.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు, జనసేన వర్గాలకు సీటు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తిరుపతి విషయంలో జనసేననే పోటీ చేస్తుంది అన్నట్లుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తిరుపతి లోక్‌సభ పరిధిలో జనసేన కార్యనిర్వాహక కమిటీని ప్రకటించడం.. కమిటీ సభ్యులను నియమిండంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి అభ్యర్థిని గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయించాలని పవన్.. కాదు కాదు కమలం పువ్వుపై అయితేనే బెటర్ అని బీజేపీ భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్.. నెలాఖరుకి హస్తినకు పోతున్నారు. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ పెరగగా.. తిరుపతిలో పోటీపడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ సత్తా నిరూపించుకుని, బలం ఉందని నిరూపించుకోవాలనేది బీజేపీ వ్యూహం. చూడాలి మరి ఎవరి ఎత్తులు.. ఎవరి పొత్తులు ఫలిస్తాయో? ఈ ఎన్నికల్లో సెకెండ్ ప్లేస్‌లో వచ్చే అవకాశాలు కూడా బీజేపీకి తక్కువే అయినా సీటు ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.

మళ్లీ ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. తిరుపతి సీటు సంగతేనా?