Panchayat Elections: ఏకగ్రీవాలపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశం!

145

ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పారితోషకం పెంచడంతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని హామీలు ఇచ్చింది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పెద్దల నుండి టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే తొలివిడతలో భారీగా ఏకగ్రీవాలు నమోదుకాగా రెండో విడతలో ఇది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరిగాయి.

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం, చిత్తూరు జిల్లా పుంగనూరు జిల్లాలో అధ్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మాచర్ల పరిధిలో 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవమవగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవమయ్యాయి.అయితే ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా.. నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్‌ విఫలమయ్యారని పేర్కొంటూ పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనీషారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌, న్యాయవాది పారా కిషోర్‌ హైకోర్టులో శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లను శనివారం విచారించిన న్యాయస్థానం ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. రేపటిలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. బలవంతపు ఏకగ్రీవాలు, ఫిర్యాదులు ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఏకగ్రీవాలపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.

Panchayat Elections: ఏకగ్రీవాలపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశం!