panchayat election: నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న వాలంటీర్లు!

271

panchayat election: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం శుక్రవారం రోజున నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రక్రియలో తొలి రోజే పలుచోట్ల వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. కానీ తొలిరోజు పలుచోట్ల వాలంటీర్లు నామినేషన్ల విధులలో పాల్గొన్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఈ వ్యవహారం బయటపడింది.

గ్రామ పంచాయతీ కార్యాలయాలలో వాలంటీర్లు ఉన్న దృశ్యాలు సైతం పలు చానెళ్లు ప్రసారం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం గ్రామ పంచాయతీ కార్యాలయాలు సచివాలయాలుగా మారిపోయాయి. ఈ సచివాలయంలో వాలంటీర్లు రోజూ విధుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. అయితే.. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు దూరంగా ఉండాలని నిబంధన ఉంది. కానీ.. సిబ్బంది కొరతతో పలుచోట్ల వాలంటీర్లు విధులలో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎన్నికల కమిషనర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.