ఆన్ లైన్ యాప్స్ టార్చర్ ఇలా ఉంటుంది : ఊరు వాడ స్పెషల్ స్టడీ

158

ఆరంభ అడుగులో అతి పెద్ద మాఫియా అయిన ఆన్ లైన్ లోన్ ఆప్స్ గుట్టును ఊరు వాడ బయటపెట్టింది. డాక్యుమెంట్లు లేకుండా లోన్ తీసుకోమని చిరుద్యోగులను, చిల్లవ్యాపారులను వరుస ప్రకటనలతో ఆకర్షించి వారిని అప్పు తీసుకునే విధంగా ప్రేరేపించి లోన్ తీసుకునేట్టు చేస్తున్నాయి. లోన్ తీసుకున్నాక పొరపాటున ఒక్క సారి లోన్ మిస్ అయిన ఫోన్ కాల్స్ , మెసేజ్ లతో ఒత్తిడి చేస్తున్నాయి.

ఈ యాప్ ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందంటే 40 వేలు , 50 వేలు లోన్ తీసుకున్న వారు సైతం వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంతలా ఉంటుంది. ఢిల్లీ, నోయిడా కేంద్రాలుగా పని చేసే ఈ యాప్స్ టార్చర్ తట్టుకోలేక ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖ, హైదరాబాద్ , గుంటూరు , సంగారెడ్డి ఇలా అన్ని ప్రముఖ పట్టణాల్లో లక్షల్లో బాధితులు ఉండగా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆన్ లైన్ యాప్స్ టార్చర్ ఇలా ఉంటుంది : ఊరు వాడ స్పెషల్ స్టడీ

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి ఫోన్లలో ఈ లోన్ యాప్ లు విపరీతంగా ప్రకటనలు ఇస్తుంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే, ” మీకు లోన్ కావాలా వడ్డీ ఏ మాత్రం లేదు”, ” మీకు లోన్ కావాలా, మీకు ఏ ఉద్యోగం లేక పోయిన క్షణాల్లో లక్ష ఇస్తాం”, ” మీక్ లోన్ కావాలంటే మా యాప్ వేసుకోండి, ఏ డాక్యుమెంట్ ఏ ప్రూఫ్ లేకుండా లోన్ ఇచ్చేస్తాం, మీకు నచ్చినప్పుడు కట్టండి”, అంటూ ఆకర్షించే విధంగా ప్రకటనలు ఇచ్చి ఆ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. ఇక లోన్ తీసుకునేప్పుడు అసలు కథ మొదలు అవుతుంది.

యాప్ ఇన్ స్టాల్ చేసుకునేప్పుడు,ఆ ఫోన్ లోని డేటాని మొత్తం ఆ యాప్స్ సేకరిస్తాయి. మన ఫోన్ లో సేవ్ చేసి ఉన్న కాంటాక్ట్ లను సైతం అవి సేకరించి, మనకి తెలియకుండా తమ వద్ద ఉంచుకుంటాయి. ఒక్క ఫోన్ నెంబర్లనే కాక మన ఫోన్ లో ఉండే ఫోటోలు, మనం ఉండే లొకేషన్ ఇలా ప్రతి అంశాన్ని యాప్ వాడుకునే వారు తమతో పంచుకునే విధంగా పర్మిషన్ తీసుకుంటుంది. ఒక వేళ మనం పర్మిషన్ ఇవ్వకపోతే ముందుకు సాగడం కష్టం. డబ్బు అత్యవసరం ఉన్న వారు అవేవి పట్టించుకోకుండా ఒకే , ఒకే కొట్టేస్తుంటారు.

కథ అక్కడ మొదలు అవుతుంది – ఇలా ఎండ్ అవుతుంది

లోన్ తీసుకున్న వారు పొరపాటున మర్చిపోయినా, ఏదైనా కారణాల వల్ల కట్టకపోయిన, యాప్ వేసుకునేప్పుడు మన ఫోన్ డేటాను మొత్తం చదివేసిన సదరు యాప్ మనకు వరుసగా కాల్స్ , వాయిస్ మెసేజ్ లు, టెక్స్ట్ మెసేజ్ లు పంపుతుంది. అక్కడి తో ఆగకుండా ఆ ఫోన్ లోని నెంబర్లన్నింటికి లోన్ ఎగవేతదారు అంటూ మానసిక క్షోభకు గురిచేసే విధంగా మెసేజ్ లు పంపుతారు. మీ వాడు లోన్ ఎగ్గొట్టాడు, రిఫరెన్స్ కింద మీ నెంబర్ ఇచ్చాడు అంటూ టార్చర్ చేస్తారు.

సున్నితమైన స్వభావం ఉన్న వారు ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఇలా మనసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్న వారే, సంగారెడ్డికి చెందిన మౌనిక , గుంటూరుకు చెందిన సునీల్. ఆకర్షనీయమైన ప్రకటనలతో మొదలయ్యే లోన్ యాప్ ల తీరు, లోన్ ఇచ్చాక వాటిని రాబట్టుకోవడానికి చేసే ఒత్తిడి దాని వల్ల జరిగే ఆత్మహత్యలతో ఎండ్ అవుతుంది.

బ్యాంక్ ల లెక్క వేరు – యాప్స్ లెక్క వేరు

సాధారణంగా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇచ్చేప్పుడు సదరు వ్యక్తి పాన్ కార్డ్ లేదా వ్యక్తి గత డేటాని కలెక్ట్ చేసి అవసరమైతే ఒక ఏజెంట్ ను ఇంటికి పంపి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోని లోన్ ఇస్తుంటాయి. ఈ పద్దతి మొత్తం RBI ఇచ్చిన కొన్ని సాంకేతిక గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఒక వేళ లోన్ తీసుకున్న వారు లోన్ కట్టలేని పరిస్థితి ఉంటే ఏం చేయాలి అనే దానిపై కూడా వారికి ఒక క్లారిటీ ఉంటుంది. RBI నిబంధనలు మీరి లోన్ తిరిగి చెల్లించే విషయంలో అప్పుతీసుకున్న వారిపై ఒత్తిడి చేయడం వారికి సాధ్యం కాదు, అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.

ఇక ఆన్ లైన్ లోన్ యాప్ లకు లోన్ ఇచ్చే ప్రక్రియలో ఒక సాంకేతికత ఉండదు, తమ టార్గెట్ కోసం ఇష్టం వచ్చినట్టు లోన్లు ఇచ్చేస్తాయి. లోన్ తీసుకునే వారి ఆర్థిక స్థితిని తెలుసుకోకుండా లోన్ ఇచ్చేస్తాయి. వీటిని కంట్రోల్ చేయడానికి లేదా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్దతి లేకపోవడంతో యాప్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక లోన్స్ ఇచ్చిన తరువాత తిరిగి చెల్లించే ప్రక్రియలో ఇబ్బందులు వచ్చినప్పుడు సదరు సంస్థలు తమ ఉద్యోగులపై ఒత్తిడి పెంచి లోన్ తీసుకున్నవారిని ఒత్తిడి చేసైనా సరే వసూలు చేయాలని టార్గెట్లు పెడుతున్నాయి. ఇక తమ టార్గెట్లకు అనుగుణంగా ఉద్యోగులు అప్పు తీసుకున్న వారికి ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటాతు.

లోన్ తీసుకోకపోతే అదే పది వేలు

ఇలాంటి ఆన్ లైన్ ఫైనాన్స్ సంస్థలకు సరైన గైడ్ లైన్స్ , ప్రణాళిక ఉండవు కాబట్టి వాటి నుండి లోన్ తీసుకోక పోవడమే మేలు. అవి ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి మన స్థాయికి మించి లోన్ తీసుకుంటే అది ఎప్పటికైనా ముప్పుగానే పరిణమిస్తుంది.