ఆన్‌లైన్ అప్పుల జోలికి వెళ్ళకండి. వెళ్తే ఇలా జరిగే అవకాశం ఉంది.

81

గుజ్జులోడి బాకీ అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పు ఇచ్చేసమయంలో మెత్తటి మాటలు చెపుతారు.. అప్పు ఇచ్చిన కొద్దీ రోజుల నుంచి కట్టాలంటూ ఇంటి చుట్టూ తిరుగుతారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పదం బాగా వాడుకలో ఉంటుంది.. ఎవరి దగ్గర అప్పు తీసుకున్న వీడి దగ్గర మాత్రం తీసుకోకూడదు వీడిది గుజ్జులోడి బాకీ అంటుంటారు.

ఇక అటువంటివే కొన్ని యాప్స్ మార్కెట్ లోకి వచ్చాయి.. లోన్ తీసుకునేవరకు తేనెపూసిన కత్తిలా ఉంటాయి. లోన్ తీసుకున్న తర్వాత సమయానికి చెల్లించకపోతే బండకొట్టే మలటులా మారి గుండెలమీద గుద్దుతాయి.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా యాప్స్ ఇదే విధంగా ఉన్నాయి.

ఇలా మెత్తగా మాటలు చెప్పి అప్పులు ఇచ్చి తీర్చలేని పరిస్థితిలో కష్టమర్ల పరువు తీస్తున్నాయి. వీటి గురించి తెలియక ఆదాయం లేకపోయినా చెల్లిస్తామని నమ్మకంతో అప్పులు తీసుకుంటున్నారు. తీరా తీసుకున్న తర్వాత చెల్లించే మార్గాలు లేక అవస్థలు పడుతున్నారు.

ఇక అదేకోవలో ఆన్‌లైన్‌ అప్పులకు ఓ అధికారిని బలైంది. నిర్దేశించిన సమయానికి అప్పు చెల్లించకపోవడంతో రుణగ్రహీత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించింది స్నాప్‌ఇట్‌ లోన్.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె మౌనిక (24). ఖాత క్లస్టర్‌ పరిధిలో ఏఈవోగా రెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తోన్నారు. కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడంతో ‘స్నాప్‌ఇట్‌ లోన్‌’ యాప్‌ నుంచి రెండు నెలల కిందట రూ.3 లక్షల రుణం తీసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా దాన్ని తిరిగి చెల్లించలేకపోయారు.

దింతో యాప్ యాజమాన్యం ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా చేసింది. ఆమె ఫోన్ లోని అన్ని కాంటాక్ట్స్ కి రుణం ఎగవేతదారుగా ప్రకటిస్తూ వాట్సప్‌ సందేశాలు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. ఇక ఈ ఘటనపై మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆన్‌లైన్ అప్పుల జోలికి వెళ్ళకండి. వెళ్తే ఇలా జరిగే అవకాశం ఉంది.