ఇప్పటికే షర్మిల.. తెలంగాణాలో మరో కొత్త పార్టీ?

579

తెలంగాణలో వచ్చే ఎన్నికల సమయానికి రాజకీయ పరిస్థితిలు ఏంటన్నది ఇప్పుడు రాజకీయాలలో తలలు పండిన నేతలకు సైతం అంతు చిక్కడం లేదు. సహజంగా రాజకీయ నేతలు అంటే అవసరాలు.. ఆదరణ నిమిత్తం పార్టీలు మారతారని పేరు. కానీ తెలంగాణలో ఉన్న పార్టీలో తేడా వస్తే కొత్త పార్టీ పెట్టడమే అనే విధంగా మారిపోయింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు తోడు కోదండరాం తెలంగాణ జనసమితి, ఎంఐఎం, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా చాలా పార్టీలే ఉన్నాయి. ఉన్న వాటికి తోడు ఇప్పుడు వైఎస్ షర్మిల మరో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టారు.

రాష్ట్రంలో పోటాపోటీ అంటే ప్రధాన పార్టీలే కావచ్చు. కానీ టీడీపీ, కమ్యూనిస్టులు, టీజేఎస్ వంటి పార్టీలు ప్రధాన పార్టీలను ప్రభావితం చేయడం గ్యారంటీ. ఇది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలో చూసేఉన్నారు. ఇక ఇప్పుడు షర్మిల, పవన్ కూడా ఇక్కడ తోడైతే గెలుపు ఓటములు తారుమారు అయ్యే ఛాన్స్ ఉండనే ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగానే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలలో ఎవరి వ్యాఖ్యలు బలంగా ప్రజలలోకి వెళ్తే వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ వచ్చే అవకాశం ఉందని ముమ్మర ప్రచారం మొదలైంది.

తెలంగాణలో మరో కొత్త పార్టీ అంశం ముందుగా బయటపెట్టింది కూడా సాక్షాత్తు మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకవ్యక్తే కాకుండా ఈ మధ్య ఈ కొత్త పార్టీల అంశంలో పార్టీ తరపున వాయిస్ వినిపిస్తుంది కూడా గంగులే. షర్మిల పార్టీ అంశంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున గంగుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పుడు తెలంగాణలో మరో కొత్త పార్టీ.. అది కూడా టీఆర్ఎస్ పార్టీలో కొందరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని గంగుల మీడియా ముఖంగా బయటపెట్టడంతో ఒక్కసారిగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గంగుల చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నది ఇప్పుడు అధికార పార్టీలో ఆసక్తిగా చర్చ సాగుతుంది.

కొంతకాలంగా మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో ముభావంగా ఉంటున్నారని ప్రచారం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి మేమే అసలైన వారసులమని చేసిన వ్యాఖ్యలు కూడా ఎరుకే. సీఎం కేసీఆర్ కు సన్నిహితుడుగా, ఉద్యమనేతగా ఉన్న ఈటలను కాదని ఎమ్మెల్సీ జిల్లా బాధ్యతలను కూడా గంగులకు అప్పగించారు. ఇప్పుడు గంగులే మాలో కొందరు సొంత పార్టీ ప్రయత్నాలలో ఉన్నారని చెప్పడంతో ఇప్పుడు అందరి చూపు మంత్రి ఈటలపై పడింది. కాగా సోషల్ మీడియాలో ఈటల అసలు హైదరాబాద్ వదిలి కరీంనగర్ వెళ్లిపోయారని ప్రచారం జరుగుతుంది.

ఈటల నిజంగానే సొంత పార్టీ పెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ నేతలతో పాటు రాజకీయ పార్టీ నుండి వచ్చిన సీనియర్ నేతల కలయిక. ఈటల సొంత కుంపటి పెడితే ఉద్యమ నేతలలో మరికొందరు టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉంటాయన్నది రాజకీయ నిపుణుల అంచనా. మరి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఈటల అంత పనిచేస్తారా? అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టకుండా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.

ఇప్పటికే షర్మిల.. తెలంగాణాలో మరో కొత్త పార్టీ?