Uppena: మెగా హీరో ట్రైలర్ రిలీజ్ చేయనున్న ఎన్టీఆర్!

268

Uppena: తెలుగు సినిమా అభిమానులలో ఒక రకమైన వర్గం ఒకటి ఉంటుంది. అదే పిచ్చికి పరాకాష్టకి చేరిన అభిమానం. తమ హీరో తప్ప మిగతా వాళ్లంతా వేస్ట్ అని.. మిగతా సినిమాలు అసలు దండగనే అభిప్రాయం వీళ్లది. ఇండస్ట్రీలోని నాలుగు ప్రధాన కుటుంబాల హీరోలను అభిమానించే వాళ్ళలోనే ఈ వర్గం కాస్త ఎక్కువగా ఉంటుంది. వీళ్ళే సోషల్ మీడియాలో చేరి చేతికి వచ్చిన భాషలో పోస్టులు పెట్టి గందరగోళం చేస్తుంటారు. అయితే.. హీరోలు మాత్రం అంతా భాయి భాయి అనుకుంటూ.. బావా.. బామ్మర్దుల వరసలతో కలిసి మెలిసి పనిచేసుకుంటున్నారు.

ఎవరు ఔనన్నా.. కాదన్నా ఆ మధ్య వరకు కూడా మెగా-నందమూరి అభిమానుల మధ్య పెద్ద అగాధం ఉండేది. ఇప్పుడు చాలా వరకు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. దానికి కారణం ఈ హీరోలు కలిసి మెలిసి మెలగడం.. మల్టీస్టారర్ సినిమాలు చేయడం. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తుండగా ఈ సినిమా మీద మెగా-నందమూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు అదే వరసలో ఒక కుటుంబంలోని హీరోలను మరొకరు ప్రమోట్ చేసే కార్యక్రమాలను కూడా భుజాన వేసుకుంటున్నారు.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కాబోతుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. మెగా కుటుంబంతో ఎన్టీఆర్ కు అనుబంధం ఉండడం.. ఉప్పెన నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కు ఎన్టీఆర్ సన్నిహితుడు కావడం కారణంగానే ఉప్పెన సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ తో మరి కాస్త హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

మెగా హీరో ట్రైలర్ రిలీజ్ చేయనున్న ఎన్టీఆర్!