Budget-2021: నిర్మలమ్మ పద్దు.. ఆంధ్రా ఆశలన్నీ హుష్ కాకే!

449

Budget-2021: హల్వా చేసి మరీ అట్టహాసంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ఆ రంగానికి ఇంత.. ఈ రంగానికి ఇంత.. ఆదుకునేది వీరిని.. వడ్డించేది వీరికి.. ఆ రాష్ట్రానికి అది చేస్తాం.. ఈ రాష్ట్రానికి ఇవి ఇస్తాం అంటూ గంటల పాటు నిలబడి ఉపన్యాసం దంచి కొట్టారు. కానీ ఈ ప్రసంగం విన్న ఏపీ ప్రజలకు నీరసం వచ్చేసింది. బడ్జెట్ లో కేటాయింపులు చూసిన ఆంధ్రా జనానికి తాము చేసిన పాపం ఏంటా అని దిగాలుపడుతున్నారు. దీనికి కారణం.. అంత పెద్ద బడ్జెట్లో ఎక్కడా ఏపీకి చిల్లిగవ్వ విదల్చలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉందని కూడా ఎక్కడా వినిపించలేదు.

ఒక విడగొట్టబడిన రాష్ట్రంగా.. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా.. ప్రతి ఆంధ్రుడి కలైన పోలవరం అనే ప్రాజెక్టు ఒకటి నిర్మాణంలో ఉన్న రాష్ట్రమైన ఏపీకి ఎక్కడా ఒక్క కేటాయింపు లేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలే సవాలక్ష ఉన్నా కనీసం వాటికి కూడా గతి లేదు. గత ప్రభుత్వ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని రాష్ట్రంలో ఏర్పాటు మొదలు పెట్టినా కనీసం వాటికి కూడా కేటాయింపులు లేనేలేవు. మరి అవి ఎప్పటికి పూర్తయ్యేనో కూడా తెలియదు. గతంలో పోలవరం పేరు చెప్పి కనీసం వెయ్యి కోట్లు కేటయించామనే మాటైనా వినిపించేది. కానీ ఈసారి అది కూడా లేదు. మా రాష్ట్రానికో మెట్రో ఇవ్వండి మహా ప్రభో ఎప్పటి నుండో అడుగుతున్నా ఈ బడ్జెట్లో కూడా అది కలేనని చెప్పేశారు.

అంత పెద్ద భారీ బడ్జెట్ లో ఏపీ పేరు వినిపించింది ఒకే ఒక్క చోట. అది కూడా విజయవాడ – ఖరగ్‌పూర్ మధ్య రవాణా కారిడర్ ప్రతిపాదనాలో ఇతమిత్థంగానే వినిపించింది. కనీసం నిర్మలమ్మ మెట్టిన రాష్ట్రమైనా ఆ కృతజ్ఞత ఎక్కడా చూపించలేదే అంటూ ఏపీ పౌరులు కూలబడిపోతున్నారు. మొత్తం 23 మంది ఎంపీలున్న రాష్ట్రం కదా ఏదైనా కనికరిస్తారేమో అని.. మాకు ఎంపీలనే ఆయుధాలను ఇస్తే మెడలు వంచి.. ఒత్తిడి తెచ్చి పిండుకొస్తామన్న పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కదా ఏమైనా వస్తుందేమోనని ఆశ పడ్డారు. బడ్జెట్ విన్నాక ఆశలన్నీ హుష్ కాకే అయిపోయాయి. ఇదేంటి సార్ ఇలా అయింది అని మన వైసీపీ ఎంపీ.. ఢిల్లీలోనే దగ్గరుండి చక్రం తిప్పే విజయసాయిని అడిగితే మన రాష్ట్రంలో ఎలక్షన్లు లేవు కదా.. అవి ఉన్న రాష్ట్రాలకే ఇచ్చినట్లుగా ఉన్నారని ఒక మాట చెప్పి ముగించేశారు.