మూఢత్వం ముందు మోకరిల్లిన ఉన్నత చదువులు..!

344

ఏడాదికి ఏడాది స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నా.. మనిషి గుండెని తీసి మరో గుండెను అమర్చే నిపుణులు వేలల్లో తయారైనా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. భారత దేశ మూలాలలో మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వదలడం లేదు. అక్షరం ముక్క రాని నిరక్ష్యరాస్యులే కాదు.. ఉన్నత చదువులు చదివిన మేధావులు కూడా ఈ మూఢ నమ్మకాల మాయలో పడడం ఇప్పుడు సామాన్య ప్రజలను కలవరపెడుతుంది. యుగాలుగా ప్రజలలో అనుబంధంగా మారిన దైవత్వంకు సమాన హక్కుగా మూఢత్వం కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా దైవత్వం ఉన్నన్ని రోజులు.. దెయ్యాలు.. భూతాలు కూడా ఉన్నాయనే నమ్మకం పెచ్చుమీరుతుంది.

చిత్తూరులో అక్క చెల్లెళ్ళ జంట హత్యలు.. కనిపెంచిన తల్లి దండ్రులే ఈ హత్యలకు తెగబడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తల్లి దండ్రులు ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకొని.. సమాజంలో అత్యున్నత పౌరులను తీర్చి దిద్దే మహోన్నతమైన బోధనా వృత్తిలోనే ఉన్నారు. సమాజంలో గురువులుగా ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ.. మూఢనమ్మకం.. దెయ్యం.. భూతం.. ఆత్మ.. అనే అంశాలు వారి చదువును.. వారి స్థానాన్ని అధిగమించి కన్న బిడ్డలను బలితీసుకున్నాయి.

తండ్రి ప్రభుత్వ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నా.. తల్లి మరో విద్యాసంస్థలో కరస్పాండెంట్ గా ఉన్నా.. తల్లి దండ్రులకు తగ్గట్లే కుమార్తెలు ఇద్దరూ ఉన్నత చదువులే చదువుతున్నా ఆ కుటుంబంలో దేవుడు-దెయ్యం-ఆత్మ-మంత్రాలు-తంత్రాలు ఈ అంశాలకే ఎక్కువ విలువ దక్కింది. ఫలితంగా తల్లిదండ్రులు వారి చేతులతోనే కుమార్తెల జీవితాలను చిదిమేశారు. చెల్లి ఆత్మను వెనక్కు తీసుకొస్తా అనేంత మూఢత్వంలోకి పెద్ద కుమార్తె ఆలోచనల్ని ప్రేరేపించారు అంటే ఈ ఇంట్లో ఈ తరహా నమ్మకాలు ఎంతగా ముదిరిపోయాయో అర్ధం చేసుకోవచ్చు.

మన దేశంలో హిందూ మూలాలు.. దైవత్వం అనే అంశాలకు తగిన స్థానం ఉంటుంది. అందుకే ఆపరేషన్ చేసే వైద్యుడు దేవుడిని తలచుకొనే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నాడు. రాకెట్ ప్రయోగానికి ముహూర్తం చూసి దేవుడిని దర్శించుకునే ప్రయోగం మొదలు పెడుతున్నారు. ఉన్నతాధికులు.. మేధావులు సైతం ఇలా ముహుర్తాలు, ఘడియల మాయలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు ఇక ఏ స్థాయిలో ఈ నమ్మకాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కదా. మరి దేశం ఎంత ముందుకెళ్లినా మూఢనమ్మకం అనే ఈ చాదస్తంలో పడి భారత ప్రజలు మగ్గిపోవాల్సిందేనా?!