టీకాంగ్రెస్ కు కొత్త సారధి.. ఇంకా నెలలు ఆగాల్సిందే?

162

కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యవహారం అయినా అంత ఈజీగా తెగదు. జస్ట్ ఎన్నిక కోసం ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలంటేనే సవాలక్ష కసరత్తులు, లెక్కలు వేసి.. కూడికలు, తీసివేతలు హెచ్చించి సీల్డ్ కవర్లో పెట్టి ఢిల్లీ నుండి రావాల్సి ఉంటుందని చెప్పుకుంటారు. అలాంటిది మరి ఒక రాష్ట్రానికి పార్టీ సారధి అంటే సింపుల్ గా ప్రకటించేస్తారని ఎలా అనుకోవాలి. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎప్పటికప్పుడు ఇదిగో కొత్త అధ్యక్షుడు వచ్చేస్తున్నాడు.. లైన్ క్లియర్ ఇక నియామకమే అని తెగ కథనాలు వచ్చేశాయి. కానీ ఎంపిక మాత్రం ఎప్పటికప్పడు వెనక్కు పోతూనే ఉంది.

ఈ మధ్య పిసిసి చీఫ్ ఎన్నికపై తేల్చేసినంత పనిచేశారు. కొత్త సారధిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అయిపోయారని.. కాదు కాదు సీనియర్ నేత జీవన్ రెడ్డి అధ్యక్షుడిగా.. ప్రచార కమిటీ సారధిగా రేవంత్ ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అంతలోనే మరికొన్నాళ్లు బ్రేక్ అంటూ ఉసూరుమనిపించారు. అందుకు కారణం నాగార్జున సాగర్ ఎన్నికలన్నారు. అయితే.. ఆ ఎన్నికల తర్వాతైనా కొత్త అధ్యక్షుడి నియమిస్తారా అంటే ఇప్పుడు అది కూడా డౌటే అని పార్టీ వర్గాలే బాహాటకంగా చెప్పేస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

పార్టీ జాతీయ అధ్యక్షుడి కోసం ఈ ఏడాది జూన్ లో ఎన్నికలు జరనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటన కూడా చేసేశారు. ఒకసారి ఆ ఎన్నిక ప్రక్రియ మొదలైతే రాష్ట్రాల నియామకం జరిగే పనికాదు. ఇక మధ్యలో ఉంది నాలుగు నెలలు కాగా సాగర్ ఎన్నికలకు ఇంకా టైం ఉంది. ఒకవేళ ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ సంప్రదింపులు, చర్చలు, బిజ్జగింపులు అంటే ఇక అంతే సంగతులు. జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడు.. ఆ తరవాతే రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇదే జరగడం ఖాయమని రాజకీయ వర్గాల కథనం.

టీకాంగ్రెస్ కు కొత్త సారధి.. ఇంకా నెలలు ఆగాల్సిందే?