New Farm Laws: వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై రాందేవ్ బాబా కీలక వ్యాఖ్య!

241

New Farm Laws: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికీ దేశంలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఢిల్లీలో రైతులు ఇప్పటికీ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రైతులతో పలుదఫా చర్చలు జరిపినా అవేమీ విజయవంతం కాలేదు. ముందు చట్టాలను వెనక్కు తీసుకొని చర్చలకు రావాలని రైతులు డిమాండ్ చేస్తుంటే.. చట్టం ఇంకా అమల్లోలేదు కనుక మీ డిమాండ్లు వినిపించాలని ప్రభుత్వం వాదిస్తుంది. ఇప్పటికే ఏడాది పాటు చట్టాలను అమలు చేయమని కేంద్రం హామీ ఇవ్వగా పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు.

కేంద్రానికి, రైతుల‌కు మ‌ధ్య నెల‌కొన్న ఘర్ష‌ణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో యోగా గురు రాందేవ్ బాబా ఓ కీల‌క సూచ‌న చేశారు. హ‌ర్యానాలో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రైన బాబా రాందేవ్.. రైతులు ఆందోళ‌న‌ల‌పై స్పందించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును మూడేళ్ల‌పాటు నిలిపేయాల‌ని ఆయ‌న కేంద్రానికి సూచించారు. దీనివ‌ల్ల రైతులు ఆందోళ‌న విర‌మిస్తార‌ని రాందేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల‌కు, కేంద్రానికి మ‌ధ్య శాంతి నెల‌కొనాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప్ర‌భుత్వానికి అధికార ప్ర‌తినిధిగానో, ఓ కాంట్రాక్టు రైతుగానో తాను ఈ స‌మ‌స్య‌పై స్పందించ‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్ప‌డం విశేషం. మూడేళ్ల పాటు కేంద్రం చ‌ట్టాల అమ‌లును వాయిదా వేయాల‌ని, ఇటు రైతులు కూడా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న సూచించారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి అటు ప్ర‌భుత్వంగానీ, ఇటు రైతులుగానీ సిద్ధంగా లేర‌ని, కానీ ఈ స‌మ‌స్య మాత్రం వెంట‌నే ప‌రిష్కారం కావాల‌ని రాందేవ్ అన్నారు. ఈ చ‌ట్టాల అమ‌లును మూడేళ్ల‌కు పొడగించి ఆలోపు ఇద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌రిపి వ్య‌వ‌సాయానికి.. దేశానికి ఏది మంచిదో అదే చేయాల‌ని చెప్పారు.

New Farm Laws: వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై రాందేవ్ బాబా కీలక వ్యాఖ్య!