జనసేనానిలో కొత్త యాంగిల్.. కాపు నేతలతో భేటీ?

345

ఏపీ రాజకీయాలు ఫక్తు కుల రాజకీయాలుగా మారిపోయాయని విశ్లేషకులు ఎప్పుడో తేల్చిసిన మాట. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఇప్పుడు కుల రాజకీయాలపై ఆధారపడ్డారని అందరికీ అర్ధమవుతున్న విషయం. పొరుగున తెలంగాణలో మత రాజకీయాలు ప్రభావం చూపిస్తుంటే.. ఏపీలో మాత్రం పూర్తిగా కుల ప్రాతిపదికనే రాజకీయాలు సాగుతున్నాయి. అందుకే.. రాజ్యాంగ బద్ద పదవులలో ఉన్న వారిపై సైతం కుల ఆరోపణలు చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు తమ పార్టీ ప్రోత్సహించదని చెప్తూ వచ్చారు.

గత ఎన్నికల ప్రచారంలో రెల్లి కార్మికుల బాధలు విని ఇప్పటి నుండి తన కులాన్ని రెల్లి కులంగా మార్చుకుంటానని చెప్పారు. అది ఎంత వరకు సాధ్యమన్నది పక్కన పెడితే.. పవన్ తనను తాను ఒక కులానికి పరిమితం చేయకూడదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. అదంతా గత ఎన్నికలకు ముందు మాట. ప్రస్తుతం పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తర్వాత కాస్త హిందూ వద్దని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగని జనసేనాని ఇప్పుడు ఏకంగా ఒక కుల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారని టాక్ నడుస్తుంది.

శుక్రవారం రోజున అంటే ఈ రోజే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం కానున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్, ఈడబుల్యుఎస్ అమలుతో పాటు కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే.. సరిగ్గా పంచాయతీ ఎన్నికలకు ముందు పవన్ కాపు నేతలతో సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తుంది.

గతంలో పవన్ తనను కాపులు మాత్రమే సొంతం చేసుకోవడాన్ని అస్సలు ఇష్టపడేవారు కాదు. అందుకే ఆ సామాజికవర్గం జనసేనకు పూర్తిగా మద్దతుగా నిలబడలేకపోయారన్న వాదన కూడా ఒకటి ఉంది. బహుశా పవన్ ఇప్పుడు ఆ ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారా? అన్న చర్చలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలో భారీగా ఉన్న ఈ సామాజికవర్గాన్ని తనకు మద్దతుగా నిలబడేలా చేసుకుంటే మరికొంత మెరుగయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే రాజకీయ కోణంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారా? లేక కేవలం వారి సమస్యలను తెలుసుకొనేందుకు.. అండగా నిలబడేందుకే సమావేశం నిర్వహిస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.

జనసేనానిలో కొత్త యాంగిల్.. కాపు నేతలతో భేటీ?