మోనాల్ నోటిదురుసు.. నెటిజన్స్ గరం గరం!

184

మోనాల్ గజ్జర్ పేరు ఈ మధ్య తెలుగు సినీ అభిమానులకు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడమే. బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు వీక్షకులను తనవైపుకు తిప్పుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించి చివరికి విన్నింగ్ అయితే దక్కలేదు కానీ తనలో హాట్ యాంగిల్ ఒకటి ఉందని దాన్ని వాడుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పింది. అనుకున్నదే తడవుగా అల్లుడు అదుర్స్ రూపంలో ఓ ఐటెం నంబరుకు అవకాశం దక్కడంతో పాటు కాస్త గట్టిగానే పైసలు గుంజేసిందని టాక్.

ఇక ఇదే వేడిలో మరికాస్త దగ్గర కావాలనుకున్న ఈ చిన్నది వరసబెట్టి పలు చానెళ్ళ నుండి చిన్న యూట్యూబ్ ఛానెళ్ల వరకు ఇంటర్వూలు ఇస్తూ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మడి మీద కారాలు మిరియాలు నూరే వరకు వచ్చింది. అసలే చిన్న చిన్న అంశాలకు కూడా మనోభావాలు దెబ్బతినే ఈ రోజుల్లో ఏకంగా రాముడి మీద వ్యాఖ్యలు చేస్తే ఊరికే పోతుందా?

ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో యాంకర్ మీకెలాంటి మొగుడు కావాలని అడిగితే శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలని జవాబిచ్చింది. కృష్ణుడిలాగా చిలిపిగా ఉండాలనుకుందో లేక ఈ కాలంలో ప్లే బాయ్ అంటే కృష్ణుడి లెక్క అనుకుందో కానీ అలా ఉండాలని ఓపెన్ గా చెప్పింది. ఈ సమాధానం విన్న యాంకర్ ఏ అమ్మాయైనా శ్రీ రాముడి లాంటి మొగుడు కావాలంటారు కానీ మీరేంటి కృష్ణుడు అంటున్నారని ప్రశ్నిస్తే మోనాల్ రాముడిని బ్యాడ్ చేసే కామెంట్స్ చేసింది.

రాముడు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలను నమ్మి భార్యను అడవుల పాలు చేసి సీతను అనుమానించాడని చెప్పుకొచ్చిన మోనాల్ రాముడు నాకు నచ్చడని చెప్పేసింది. ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానని చెప్పింది. అంతే.. మోనాల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాముడి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్.. రాముడి గురించి మాట్లాడేంత గొప్పదానివి అయిపోయావా అంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

మోనాల్ నోటిదురుసు.. నెటిజన్స్ గరం గరం!