Nellore News : కాపురానికి తీసుకెళ్లి హత్య చేశాడు.

158

Nellore News : ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి దేవుడి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు బాగానే కాపురం చేసిన భర్త ఆ తరువాత అనుమానం పెంచుకున్నాడు. నాలుగు నెలల పాటు తల్లిదండ్రులతోనే ఉంది భార్య.. శుక్రవారం ఇంటికి వచ్చి మంచిగా చూసుకుంటానని నమ్మబలికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్‌నగర్‌లో జరిగింది.. వివరాల్లోకి వెళితే బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లాప్రోలు వడ్డిపాళేనికి చెందిన కోడి హరికృష్ణ.. కొడవలూరు మండలం గండవరం శివపురం గిరిజన కాలనీకి చెందిన గడ్డం స్రవంతి(19) నార్తురాజుపాళెంలోని ఓ స్వీట్ దుకాణంలో పనిచేసేవారు. ఇక్కడే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.

పరిచయం ప్రేమగా మారింది. తమకు పెళ్లి చెయ్యాలని స్రవంతి తన తల్లిదండ్రులను కోరింది. కులాలు వేరుకావడంతో మొదట వారు ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పుకున్నారు. జూన్‌ 10న పల్లాప్రోలు రామాలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత రెండ్రోజులు మాత్రం స్రవంతిని పల్లాప్రోలులో ఉంచిన హరికృష్ణ అనంతరం ఆషాడం పేరు చెప్పి తల్లిగారి ఇంటికి పంపాడు.. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే వాడు. ఈ తరుణంలోనే స్రవంతిపై హరికృష్ణ అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల తర్వాత గ్రామానికి రావడమే మరిచిపోయాడు.. ఫోన్ కూడా చెయ్యలేదు. స్రవంతి పెద్దమ్మ తలపల కృష్ణమ్మ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలులో ఉంటోంది. అక్కడికి ఈ నెల 27న స్రవంతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లాడు.

అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తాను మారానని తెలిపారు. స్రవంతిని తనతో పంపాలని కోరాడు. నమ్మిన తల్లిందండ్రులు హరికృష్ణతో స్రవంతిని పంపారు. కానీ రాత్రికి స్రవంతి అక్క ఇందిర ఇంట్లో ఉండాలని షరతు పెట్టారు. దింతో భార్యను తీసుకోని కొడవలూరు మండలం ఎన్టీఆర్ నగర్ లోని స్రవంతి అక్క ఇందిర ఇంటికి వెళ్ళాడు. అక్కడే అర్ధరాత్రి భార్య గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. ఉదయం ఇందిర ఇంటికి వచ్చి గమనించగా బయట గడిపెట్టి ఉంది. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా స్రవంతి రక్తపు మడుగులో పడివుంది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. ఘటన స్థానికి చేరుకున్న పోలీసులకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Nellore News : కాపురానికి తీసుకెళ్లి హత్య చేశాడు.