సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు తెరపైకి

66

నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ గెలుపుకోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీలో ఎవరుంటారు అనేది ఇంకా స్పష్టత లేనప్పటికీ, ప్రధాన పార్టీల దృష్టి మొత్తం ఈ ఉపఎన్నికపైనే ఉంది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో జానారెడ్డిని ఎదురుకోవాలి అంటే బలమైన నాయకుడు కావాల్సి ఉంటుంది.

సింపతీతో గెలుస్తామని టీఆర్ఎస్ భావిస్తే దుబ్బాకలో దెబ్బ కొట్టినట్టే సాగర్ ప్రజలు కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. నోముల కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే గెలుస్తారని నమ్మకంగా చెప్పడం కష్టం. బలమైన క్యాడర్ ఉన్న జానారెడ్డిపై గెలవడం అనేది కష్టమైన పనే. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసీఆర్ హవాతో విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఏ హవా నడిచేలాగా లేదు. పోటీ అనేది స్థానిక నేతను బట్టే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఓ యువనేతకు తెరపైకి తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు రంజిత్ యాదవ్ కు టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గం మొత్తంలో బలమైన నేతగా రంజిత్ యాదవ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నియోజకవర్గంలోని యాదవ సామజిక వర్గాన్ని ఆకర్షించగల శక్తి రంజిత్ కి ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

యాదవుల ఓటు బ్యాంకు ఇక్కడ పెద్దమొత్తంలో ఉంటుంది. వీరే నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించగలరు. ఇక్కడ రెడ్డి సామజిక వర్గం ఓట్లు కూడా పెద్దమొత్తంలో ఉన్నాయి. కానీ వీరంతా వివిధ పార్టీలలో ఉండటంతో ఓట్లు చీలిపోతాయి. కానీ యాదవుల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉంది. మరో వ్యక్తి పేరును కూడా పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రవీందర్ రెడ్డి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు.

ఇక బీజేపీ నుంచి నివేదిత శ్రీధర్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి నివేదిత పోటీ చేశారు. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. ఈ సారి మాత్రం తాను విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు నివేదిత. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమి లేదని, ఈ సారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం నుంచి మాత్రం టికెట్ పై స్పష్టత రాలేదు. కాగా ప్రస్తుతం నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు.

సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు తెరపైకి