Municipal Elections: ప్రచారానికి చంద్రబాబు.. రణరంగం తప్పదా?

449

Municipal Elections: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు ఐదు కీలక జిల్లాల్లో ఈ సుడిగాలి పర్యటన సాగనుండగా గురువారం నుంచి ప్రచారం మొదలుకానుంది. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రచారం జరుగుతుంది. నిజానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతలు, అధ్యక్షులు పాల్గొనడం చాలా అరుదు. అధికార పార్టీ అధ్యక్షులైతే అసలు ఈ సాహసం చేయరు.. అంత చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కనుక కావాల్సినంత సమయం ఉండడంతో చంద్రబాబు ఈ సాహసం చేస్తున్నారు.

ఎన్నికలు ఏవైనా.. ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికా అంటూ వెక్కిరింతలు మొదలుపెట్టినా ఆయన మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. అయితే.. చంద్రబాబు ప్రచారానికి సిద్ధపడితే మరో రంగరంగం తప్పదా అనే చర్చలు మొదలయ్యాయి. మొన్న చిత్తూరు జిల్లా పర్యటనలలో విమానాశ్రయంలోనే అడ్డుకోవడం.. ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య విమర్శలు.. కార్యకర్తల నిరసనలు ఇలా ఒక రోజు మొత్తం హైడ్రామా నడిచింది.

ఇక ఇప్పుడు ఏకంగా ఐదు రోజులు ఐదు జిల్లాలలో ప్రచారం అంటే ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రచారం చేయాలనుకున్న ఐదు జిల్లాలలో మూడు జిల్లాలు చాలా కీలకం. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అమరావతి ప్రభుత్వ వ్యతిరేక అంశం కాగా.. విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ చంద్రబాబు ఎజెండాగా మారే అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా చంద్రబాబు ప్రచారం చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది. మరి బాబు ప్రచారానికి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో.. స్థానిక పోలీసులు అనుమతులు ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే చంద్రబాబు ప్రచారానికి వెళ్లకుండా ఉంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది.