ములుగు జిల్లాలో వింత వ్యాధి.. ఆరుగురు మృతి

111

కరోనా తగ్గనే లేదు.. కొత్తరకం కరోనా అంటూ గుబులు మొదలైంది. ఇదిలా ఉంటే అంతుచిక్కని వ్యాధులు ప్రజలను కబళిస్తున్నాయి. ఏలూరు వింత వ్యాధి ఘటన జరిగిన తరువాత అనేక ప్రాంతాల్లో వింత వ్యాద్యులు బయటకు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఓ వింత వ్యాధి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఇక తాజాగా ఇప్పుడు మరో వ్యాధి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ములుగు జిల్లాలో ఈ వింత వ్యాధి బారినపడి ఆరుగురు మృతి చెందారు. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో ఈ వింత వ్యాధి దర్శనం ఇచ్చింది.

మొత్తం 70 కుటుంబాలు ఉండే ఈ కాలనీలో గడిచిన 20 రోజుల వ్యవధిలో వింత వ్యాధితో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. మొదటి రోజు జ్వరం లక్షణాలు కనిపించి రెండు, మూడు రోజుల్లో పొట్ట ఉబ్బి మృతి చెందుతున్నారట. ఇక దీనిపై స్థానికులు మాట్లాడుతూ ఈ వ్యాధి తమను భయపెడుతుందని తెలిపారు. కళ్ళముందు తిరిగిన వారు రెండు మూడు రోజుల్లో మృతి చెందటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది. అసలు ఇది ఏం వ్యాధి అనేది గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారులు.

ఇక ఈ ఘటనపై వైద్యులు స్పందించారు. కలుషిత నీరే కారణం కావచ్చని డీఎం అండ్ హెచ్‌ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరికొంతమందికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

ములుగు జిల్లాలో వింత వ్యాధి.. ఆరుగురు మృతి