కొత్త కస్టమర్ల విషయంలో జియోను అధిగమించిన ఎయిర్‌టెల్

75

కొత్త కస్టమర్లను చేర్చే విషయంలో భారతి ఎయిర్‌టెల్ వరుసగా నాలుగో నెల కూడా జియోను అధిగమించింది. అదేసమయంలో వోడా-ఐడియా (వి), బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ వంటి అన్ని ఇతర టెలికాం ఆపరేటర్ల వినియోగదారుల సంఖ్య కూడా క్షీణించింది. టెలికాం రెగ్యులేటర్ TRAI గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎయిర్టెల్ నవంబర్లో అత్యధికంగా 43.7 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చింది, దీంతో ఇప్పుడు కంపెనీ మొత్తం యూజర్ బేస్ 33.465 కోట్లకు పెరిగింది.

అదే నెలలో రిలయన్స్ జియో 19.3 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చింది, ఆ తర్వాత కంపెనీ మొత్తం యూజర్‌బేస్ 40.829 కోట్లకు పెరిగింది. వి (వోడా-ఐడియా) నవంబర్ చివరి నాటికి 28.9 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది, ఆ తర్వాత కంపెనీ యూజర్‌బేస్ 28.994 కోట్లుగా ఉంది. ఇవే కాకుండా, ఎమ్‌టిఎన్‌ఎల్ 6,016 మంది వినియోగదారులను కోల్పోగా, బిఎస్‌ఎన్‌ఎల్ 556 మంది కొత్త వినియోగదారులను చేర్చింది.

కొత్త కస్టమర్లను చేర్చుకోవడంలో ఎయిర్‌టెల్ ముందంజలో ఉన్నప్పటికీ, జియో 35.34% మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలిచింది, ఎయిర్‌టెల్ 28.97% మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది.

Vi మార్కెట్ వాటా 25.10% కి తగ్గింది, BSNL మరియు MTNL యొక్క వాటా వరుసగా 10.3% , 0.3% గా ఉన్నాయి.. నవంబర్ 30, 2020 నాటికి, ప్రైవేట్ కంపెనీలు 89.41% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, బిఎస్ఎన్ఎల్ , ఎంటిఎన్ఎల్ మొత్తం మార్కెట్ వాటాను 10.6% మాత్రమే కలిగి ఉన్నాయి.

మొబైల్ నెట్‌వర్క్‌లలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నప్పటికీ, రిలయన్స్ జియో క్రియాశీల వినియోగదారుల సంఖ్య ఎయిర్‌టెల్ , వి కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం జియో క్రియాశీల వినియోగదారుల సంఖ్య 79.55% కాగా, ఎయిర్‌టెల్ , వి యొక్క క్రియాశీల వినియోగదారుల సంఖ్య వరుసగా 89.01% , 96.63% గా ఉన్నాయి.

ట్రాయ్ గణాంకాల ప్రకారం , భారతదేశంలో టెలికం కంపెనీల మొత్తం చందాదారులు 2020 అక్టోబర్‌లో 115.181 కోట్ల నుండి 2020 నవంబర్ చివరి నాటికి 115.520 కోట్లకు పెరిగి నెలవారీ వృద్ధి 0.29% గా నమోదైంది. ఇందులో 63.04 కోట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 52.48 కోట్లు ఉన్నాయి.