వాజ్ పేయి జయంతి రోజు రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ

100

బీజేపీ అధ్యక్షుడు నడ్డా గురువారం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోడీ దేశంలోని రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నడ్డా మార్గదర్శనం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులకు, వివిధ స్థాయిల్లోని నేతలకు లేఖలు పంపారు. ఇక ప్రధాని నిర్వహించే సమావేశంలో రైతులకు కిసాన్ యోజన పథకం కింద అందిస్తున్న నగదు సాయాన్ని విడుదల చేయనున్నారు. 9 కోట్ల మంది రైతులకు రూ.2000 వేల చొప్పున మొత్తం రూ.18 వేల కోట్లను విడుదల చేస్తారు.

ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో రైతులు వీక్షించే విధంగా బ్లాక్ డెవలప్‌మెంట్ సెంటర్ల వద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలను నడ్డా ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో తప్పనిసరిగా మోదీ స్పీచ్ ప్రారంభానికి ఒక గంట ముందు కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. మోడీ ప్రసంగానికి ముందు గంటపాటు ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి రైతులకు వివరించాలని నడ్డా సూచించారు.

రైతుల కోసం వేప పూత పూసిన యూరియా, ప్రధాన మంత్రి పంటల బీమా యోజన, భూసార కార్డు, కనీస మద్దతు ధర, ప్రధాన మంత్రి వ్యవసాయ యోజన, కిసాన్ రైలు, వ్యవసాయ రంగంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వంటి అంశాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు పెద్ద సంఖ్యలో వీక్షించేలా చూడాలని తెలిపారు నడ్డా.

రైతులు ఈ కార్యక్రమం చూడటం వలన ఇప్పటివరకు తెలియని విషయాలు తెలుస్తాయని నడ్డా తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో అనే విషయాలు తెలుస్తాయని అన్నారు. రైతులకు ఎమ్ఎస్పీపైన అపోహలు ఉన్నాయని. అవి తొలగిపోతాయని, కొత్త వ్యవసాయ చట్టాలపై కూడా క్లారిటీ వస్తుందని వివరించారు.

వాజ్ పేయి జయంతి రోజు రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ