వివాదాస్పద పొలిటికల్ అంశంపై మెగాహీరో సినిమా?

184

మన సినిమా హీరోలంటే దేన్నైనా జయిస్తారు.. ఏదైనా సాధిస్తారు.. వందమంది రౌడీలను తుక్కు తుక్కుగా కొడతారు.. అవసరమైతే గాల్లో ఎగిరే విమానాలను సైతం సింగిల్ హ్యాండ్ తో పేల్చేస్తారు. కానీ అవన్నీ నిజజీవితంలో జరిగే పనులే కాదని ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ మధ్య మరో రకమైన సినిమాలు కూడా వస్తున్నాయి. అవే సోషల్ ఎలిమెంట్ అంశాలను జోడించిన కథలతో తెరకెక్కే సినిమాలు. కొరటాల శివ లాంటి దర్శకుల సినిమాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే ట్రాక్ లో మరో దర్శకుడు కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అతనే దర్శకుడు దేవాకట్టా.

వెన్నెల లాంటి కామెడీ కథతో దర్శకుడిగా మారిన దేవాకట్టా.. ప్రస్థానం అనే సీరియస్ కథతో రాజకీయ కుటుంబాలలో ఉండే సున్నితమైన వ్యధని.. నేటి సమాజంలో మనిషి నడవడికను కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. అనంతరం ఆటో నగర్ సూర్య లాంటి సినిమాలు వచ్చినా అవి ఆశించినంతగా సక్సెస్ కాలేదు. కొద్దిరోజులుగా కాస్త సైలెంట్ గా ఉన్న దేవాకట్టా ఇప్పుడు మరో పొలిటికల్ ఇస్యూతో సిద్దమైనట్లుగా తెలుస్తుంది. దేవాకట్టా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఇప్పటికే రిపబ్లిక్ అనే టైటిల్ తో సినిమా ప్రకటించాడు.

ఈ సినిమా ఓ వివాదస్పద పొలిటికల్ అంశం ఆధారంగా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సుపై చాలా కాలంగా వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్‌తోనే రిపబ్లిక్ కథ సాగుతుందని సినీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా పనిచేస్తూ పోరాటం చేస్తారని సమాచారం. రమ్యకృష్ణ సీఎంగా నటించనుండగా కాన్సెప్ట్ మొత్తం కొల్లేరు అంశంపైనే సాగుతుందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమన్నది కొద్ది రోజులు గడిస్తేనే తెలియనుంది.

వివాదాస్పద పొలిటికల్ అంశంపై మెగాహీరో సినిమా?