Marriage underwater: సముద్ర గర్భంలో పెళ్లిచేసుకున్న తమిళనాడు జంట!

202

Marriage underwater: పెళ్లంటే అదొక పండగ. బంధువులు, స్నేహితులను పిలిచి అక్షింతలు ఆశీర్వాదాలు తీసుకొని వేదమంత్రాలూ, మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవం చేసుకోవాలని యువతీ యువకులకు ఉండే కోరిక. మతాలు, సంప్రదాయాలు మారినా వారి వారి పద్దతులలో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో సంప్రదాయాల కన్నా కాస్త వెరైటీ ఉండే బాగుంటుందనే కోరికలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా అలాంటి పెళ్లి ఒకటి అయింది. నాలుగైదు కిమీ సముద్రంలోకి వెళ్లి అక్కడ ఓ అరవై అడుగుల లోతున నీళ్లలో పెళ్లి చేసుకుంది ఓ జంట.

 12 ఏళ్లుగా స్కూబా డైవర్ (scuba diver) అయిన వి.చిన్నదురై... టి.శ్వేతను సముద్రంలో పెళ్లి చేసుకున్నారు. అలా ఆయన సముద్రంపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

తమిళనాడులోని నీలంకరైకి చెందిన వి.చిన్నదురై అనే వ్యక్తి 12 ఏళ్లుగా స్కూబా డైవర్. తరచుగా అలా సముద్రం గర్భంలో తిరుగుతుండడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సముద్రంలో పేరుకుపోతున్న చెత్త గురించి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాడు. దానికి తన పెళ్లిని ఆయుధంగా చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. తానంటే స్కూబా డైవర్. కానీ తాను చేసుకున్న అమ్మాయి శ్వేత మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సముద్రంలో పెళ్లి అనగానే ముందు భయపడిందట.

 పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుతమైన మరపురాని ఘట్టం. ఈ పెళ్లిని ఒక్కొక్కరూ ఒక్కో రంగా చేసుకుంటారు. ఆ జంట ఏకంగా సముద్ర గర్భంలో పెళ్లి చేసుకున్నారు.

కానీ చిన్నదురై ఆమెని ఒప్పించి ట్రైన్ చేసుకొని మరీ సముద్రంలో పెళ్లి చేసుకున్నాడు. సముద్రంలో.. అరవై అడుగుల నీళ్లలోనే దండలు మార్చుకున్న ఈ జంట.. అక్కడే తాళి.. అక్కడే ఫోటో సెషన్ కూడా పూర్తిచేశారు. సముద్రంలో కాలుష్యం బాగా పెరుగుతోందని.. దాన్ని తగ్గించి సముద్రాలను కాపాడాలని ఈ జంట మెసేజ్ ఇచ్చారు. నీలంకరైలోని సముద్రంలో సోమవారం జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. ఈ జంట చెప్పాలనుకున్న అంశాన్ని ప్రపంచానికి చెప్పారు. మరి మనుషులు పాటించి సముద్రాన్ని కాపాడతారా అన్నదే అసలైన ప్రశ్న!

 నేను సర్టిఫికెట్ పొందిన స్కూబా డైవర్‌ని. మేం సముద్రంలో చాలా ప్లాస్టిక్ వృథాగా ఉండటం చూస్తున్నాం. ముఖ్యంగా మాస్కులు చాలా ఉన్నాయి. అవి సముద్ర గర్భంలోని ఇసుకపై పేరుకుపోతున్నాయి అని చిన్నదురై తెలిపారు.