Mahabubabad accident : ఆటో-లారీ ఢీ.. ఆరుగురు మృతి!

114

Mahabubabad accident : నిత్యం రహదారులు ఎక్కడోచోట నెత్తురోడుతున్నాయి. ప్రజలు ఇంటి నుండి రోడ్డెక్కితే మళ్ళీ తిరిగి ఇంటికి చేరే వరకు దినదినగండంగా మారుతుంది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద లారీ-ఆటో ఢీకొన్న సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. గూడూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కినట్లు సమాచారం.

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో గూడురు శివారుకు చేరుకునేసరికి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.