చిత్తూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు కూతుళ్లను హత్యచేసిన భార్యాభర్తలు

78

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతుర్లనే మంత్రాల పేరుతో కడతేర్చారు తల్లిదండ్రులు. మదనపల్లె మండలం అంకిరెడ్డిపల్లె పంచాయితీ శివనగర్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఎస్. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో పెద్దకూతురు అలేఖ్య (27) బోపాల్‌లో పీజీ చేస్తున్నారు. చిన్న కూతురు సాయి దివ్య (22) బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్ లో సంగీతం నేర్చుకుంటున్నారు. కాగా గత ఏడాది ఆగష్టులో శివనగర్ వీరు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు.

అందులో నిత్యం ఎదో ఒక పూజ చేస్తుండే వారు.. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా పూజ నిర్వహించారు. ఈ సమయంలో చిన్న కూతురు సాయి దివ్యను శూలంతో పొడిచి చంపేశారు. పెద్దకూతురు అలేఖ్య నోట్లో కలశం చెంబు కుక్కి, డంబెల్ తో కొట్టి హత్య చేశారు. ఈ విషయాన్నీ పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్‌కుమార్‌, రమాదేవి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు ఏమి చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. హతులంతా దైవభక్తి లీలలో మునిగిపోయారని డీఎస్పీ తెలిపారు. మృతుల్లో ఒకరైన సాయిదివ్య (22) మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. ‘శివ ఈజ్‌ కమ్‌.. వర్క్‌ ఈజ్‌ డన్‌’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఈ కుటుంబంలోని వారంతా విద్యావంతులే, పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. తన భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వారు, ఈ చర్యకు పాల్పడటం చుట్టుపక్కలవారిని ఆగ్రహానికి గురిచేస్తుంది.

ఇద్దరు కూతుళ్లను హత్యచేసిన భార్యాభర్తలు