Madanapalle murders: నాలుక కోసి తినేసిన తల్లి పద్మజ!

197

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో సంచలనం రేపిన జంట హత్యలలో రోజు రోజుకూ కొత్త కొత్త అంశాలు తెరమీదకి వస్తున్నాయి. బయటపడే ప్రతి అంశం సమాజాన్ని విస్తుపోయేలా చేయడమే కాదు.. ఇంత అనాగరికమా అనే ఆలోచనలను రేకెత్తిస్తుంది. తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులు అయినా మూఢనమ్మకంతో కూతుళ్ళను అతి కిరాతకంగా చంపేశారు. అంతేకాదు.. హత్యలకు ముందు ఆ ఇంట్లో చేసిన పిచ్చి చేష్టలు కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను.. మానసిక వైద్యులను సైతం షాక్ కు గురిచేస్తున్నాయి.

నిందితురాలు పద్మజ తనను తాను కాళికగా భావించుకుని పెద్ద కుమార్తె అలేఖ్యను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసిందని భర్త పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పారట. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉండగా ఈ కుటుంబం ఎంతగా మూఢత్వంతో ఉందో ఈ ఘటన తెలియజేస్తుంది. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని వెల్లడించిన పురుషోత్తం కాలేజీలో పాఠాలు చెప్పడం నీ వృత్తికాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని అలేఖ్య తనకు చెప్పినట్లు పురుషోత్తం తెలిపారు.

అంతేకాదు.. కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య నమ్మబలికిందని.. కరోనా కూడా ఇందుకు ఒక సూచికని చెప్పేదని.. తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉండడంతో అదే నిజమని తాము నమ్మామని చెప్పారు. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్న పద్మజ తన కూతుళ్లు వస్తున్నారు తాము ఇంటికి వెళ్లాలని చెప్తూ.. శివయ్య.. కృష్ణయ్య అంటూ కేకలు పెడుతుంటే.. పురుషోత్తం ఏడుస్తూ పక్క గదిలో విచారిస్తున్న అధికారులకు ఒక్కొక్కటికి కేసు గురించి బయటపెడుతున్నారు.