కోడిపెంట లోడులో లిక్కర్.. ముక్కుమూసుకొని వెలికితీసిన పోలీసులు!

329

ఏపీలో ఇప్పుడు లిక్కర్ కు కష్టాలొచ్చిపడ్డాయి. అసలే లోకల్ ఎలక్షన్స్. ఎన్నికలంటేనే మందు బాబులకు పండగ. ఎన్నికలు ఏదైనా మన దేశంలో మద్యం ఏరులై పారాల్సిందే. ఇది అందరికీ తెలిసిందే నిజమే. కానీ ఏపీలో మద్యం షాపులన్నీ ప్రభుత్వానివే. పెద్ద మొత్తంలో కొనాలి అంటే పంచాయతీ అభ్యర్థులకు కష్టమైపోయింది. ఎలాగోలా మద్యం సంపాదించినా అది గమ్యస్థానానికి చేర్చడం కనాకష్టమైపోతుంది. అందుకే కేటుగాళ్లు పోలీసులకు అనుమానం రాకుండా.. వచ్చినా సరే వారికి చిక్కనంతగా ప్లాన్ చేసి మద్యాన్ని తరలించారు. కానీ చివరికి పోలీసులు పెట్టేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పరిధిలోని చింతలపూడి నియోజకవర్గం లింగగూడెం చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపటడుతున్నారు. అంతా సైలెంట్ గా ఉండగానే కోళ్ల పెంట లోడుతో ఓ ట్రాక్టర్‌ వచ్చింది. అప్పటికే పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతో చేసేదేం లేక చింతలపూడి సీఐ మల్లేశ్వరావు, ఎస్సై స్వామి, పోలీసు సిబ్బంది ముక్కుమూసుకొని మరీ ఆ కోడిపెంట లోడు మొత్తం వెతికారు. అనుకున్న విధంగానే కళ్ళు బయ్యర్లుకమ్మేలా దాదాపు వెయ్యి లిక్కర్ బాటిళ్లు బయటపడ్డాయి.

ట్రాక్టర్ ట్రాలీలో ముందుగా లిక్కర్ బాటిళ్లను పెట్టి.. ఆపై భాగాన్ని కోడిపెంటతో నింపి తరలిస్తున్నారు. మొత్తం 200x 48=9600 క్వార్ట్రర్ సీసాలు (200 లిక్కర్ కేసులు), 96 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎక్సయిజ్ శాఖకు అప్పగించారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం కావడం విశేషం కాగా అసలు రాష్ట్ర సరిహద్దు ఎలా దాటిందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కోడిపెంట లోడులో లిక్కర్.. ముక్కుమూసుకొని వెలికితీసిన పోలీసులు!