మాయదారి మైసమ్మ సింగర్ మృతి

57

మాయదారి మైసమ్మ, కోడిపాయే లచ్చమ్మది అనే పాటలు టేప్ రికార్డులు ఉన్న సమయంలో మంచి ఫేమస్. కాగా ఈ పాటలు పాడిన గేయ రచయిత, గాయకుడు లింగరాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగరాజ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. లింగరాజ్ పాడిన మాయదారి మైసమ్మ పాటకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అప్పట్లో ఈ పాటకు పలు అవార్డులు కూడా లభించాయి. 66 ఏండ్ల లింగరాజ్ గత కొంత కాలంగా పాటలు పాడటం లేదు. కాగా మొత్తం వెయ్యికి పైగా పాటలను ఆలపించారు. అంతే మొత్తంలో నటించారు.

బొల్లారం ఆదర్శనగర్‌ కు చెందిన లింగరాజ్‌.. స్థానిక మిత్రులతో కలసి డిస్కో రికార్డింగ్‌ కంపెనీ (డీఆర్‌సీ) పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంచి భక్తి పాటలు పాడారు. ఇప్పటికి ఆయన పాటలు పలు దేవాలయాల్లో ప్రతి రోజు మారుమోగుతుంటాయి. ఇక అయ్యప్ప పాటలను కూడా పాడారు. కార్తీకమాసం సమయంలో అయ్యప్ప భజనలు ఏర్పాటు చేసేవారు లింగరాజ్. అయ్యప్ప భజనపాటలు ఎన్నో రచించి పాడారు లింగరాజ్.

లింగరాజ్ మృతి చెందటంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కాగా ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

మాయదారి మైసమ్మ సింగర్ మృతి