కేటీఆర్ సీఎం.. తిరుమల వెంకన్న సాక్షిగా మేయర్ బొంతు!

134

కేటీఆర్ సీఎం అవుతారో లేదో కానీ ఆయన్ని సీఎం చేయాలనే డిమాండ్ మాత్రం ఆగడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో కొంత కాలంగా కాబోయే సీఎం కేటీఆర్ అనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. మరికొందరు అడుగు ముందుకేసి సీఎం ఆయనే అన్నట్లుగా శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. కానీ ఇప్పటికీ అది ప్రచారంగానే ఉంది. మరి నిజంగానే అయన సీఎం అవుతారో.. లేదో కానీ టీఆర్ఎస్ నేతల భజన మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనే సీఎం అనే వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా చేరారు.

మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే ప్రచారంపై స్పందించిన బొంతు.. దేవుని ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారని.. కాకపోతే అన్నిటికి సమయం సందర్భం రావాలని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏం జరగాలనేదానిపై సీఎం కేసీఆర్, పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల ఆమోదంతోనే కేటీఆర్ సీఎం పదవిలో కూర్చుంటారని ఖచ్చితంగా చెప్పారు.

కేటీఆర్ సీఎం.. తిరుమల వెంకన్న సాక్షిగా మేయర్ బొంతు!