కృష్ణాజిల్లా వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విబేధాలు.. రాళ్లతో దాడులు..

136

కృష్ణాజిల్లా వైసీపీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పర్యటనలో వివాదం చోటుచేసుకుంది. రహదారుల శంకుస్థాపన కోసం వచ్చిన వంశీకి వ్యతిరేకంగా మరో వర్గం భగ్గుమంది. కాసరనేని రంగబాబు, ముప్పలనేని రవి మధ్య ఘర్షణ చోటుచేసుసుకుంది. రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

కాగా గత కొంతకాలంగా గన్నవరం నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మూడు గ్రూపులున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన దుట్టా రామచందర్ రావు వర్గం ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.. అలాగే 2019 లో పోటిచేసిన యార్లగడ్డ వెంకటరావు వర్గం కూడా వైసీపీలోకి వంశీ రాకను వ్యతిరేకిస్తోంది. దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీ తలపెట్టే ఏ కార్యక్రమాన్నైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ప్రతిసారి వైసీపీ పెద్దలు కలుగజేసుకొని సమస్యను సద్దుమణిగించడానికి శ్రమించాల్సి వస్తోంది.