త్వరలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

440

త్వరలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని అన్నారు. భవిష్యత్ లో తాను బీజేపీలో చేరుతానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని వివరించారు రాజగోపాల్ రెడ్డి. కాగా రెండేళ్ల నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. గతంలో కూడా చాలాసార్లు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రాజగోపాల్ రెడ్డి..

ఇక టీపీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నకు టీపీసీసీ వస్తే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకపోవచ్చు. వెంకట్ రెడ్డిని కాదని వేరే ఎవరికైనా టీపీసీసీ ఇస్తే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకునేందుకు కాషాయ పార్టీ నేతలు ఎప్పుడు సిద్దంగానే ఉంటారని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. మంచి పేరుకూడా ఉంది. తెలంగాణ రాష్ట్రము కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాడారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

కోమటిరెడ్డి అంటే నల్గొండ, నల్గొండ అంటే కోమటిరెడ్డి అనే విధంగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి నల్గొండలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో వెంకట్ రెడ్డి ఒకరు. ఇక రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశారు రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుంది. భువనగిరి పార్లమెంట్ తోపాటు నల్గొండ పార్లమెంట్ పరిధిలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభిమానులు చాలామంది ఉన్నారు. ఓ సినిమా హీరోను అబిమానించినట్లే నల్గొండ ప్రజలు కోమటిరెడ్డి కుటుంబాన్ని అభిమానిస్తారు. ఇక దక్షిణ తెలంగాణాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తే తిరుగుండదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.

త్వరలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి