కెనడాలో హిందువులపై దాడి చేస్తున్న ఖలిస్థాన్ మద్దతు దారులు

571

దేశంలో రైతుల ఆందోళనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.. కొందరు దీనిని రైతు ఉద్యమం అంటుంటే మరికొందరు ఖలిస్థాన్ ఏర్పాటు ఉద్యమమంటూ అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మద్దతిస్తున్నారు. ఇదిలా ఉంటే రైతు ఉద్యమం పేరుతో కెనడాలో ఉండే భారతీయులపై ఖలిస్థాన్ ఏర్పాటువాదులు దాడులు చేస్తున్నట్లుగా అక్కడ ఉన్న హిందువులు నిరసనకు దిగారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని.. ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని, కానీ ఖలిస్థాన్ ఏర్పాటు వాదులు తమపై కక్షకట్టి ఈ విధంగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎంపీ జగ్మీత్‌ సింగ్‌ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేపట్టారు నిరసన కారులు. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రతిఒక్కరినీ కాపాడాలని తాము నేతలను కోరుతున్నామని చెప్పారు. నిరసనకారుల్లో కొందరు కెనడా జెండాలను ప్రదర్శించారు. ఇక ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రతకు చర్యలు చేపట్టాలని భారత్‌ ఇటీవల కెనడా అధికారులకు విజ్ఞప్తి చేసింది. కెనడాలో భారత పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తాము కెనడా అధికారులను కోరామని, ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా కెనడా పోలీసులతో పాటు భారత కాన్సులేట్స్‌కు సమాచారం అందించాలని భారత సంతతికి చెందిన వారికి విజ్ఞప్తి చేస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

కెనడాలో హిందువులపై దాడి చేస్తున్న ఖలిస్థాన్ మద్దతు దారులు