విరాట్‌ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు

147

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రముఖ నటి తమన్నా భాటియా, అజు వర్గీస్‌లతో పాటు విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసు ఇచ్చింది. ఆన్‌లైన్ రమ్మీపై చట్టపరమైన నిషేధం కోరుతూ పిటిషన్ దాఖలైంది.. ఈ కేసుకు సంబంధించి నోటీసు వచ్చినట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ఆన్‌లైన్ రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. సెలెబ్రెటీల తోపాటు ఆన్‌లైన్ రమ్మీపై స్పందన తెలియజేయాలని కేరళ ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా అంచనా ప్రకారం, మొబైల్‌లో ఆడే ఈ రమ్మీ గేమ్ సుమారు 200 కోట్ల రూపాయల ప్రకటనలతో పెద్ద సంఖ్యలో యువతను ప్రముఖులు మభ్యపెట్టారని.. దీనివలన పెద్దఎత్తున యువత పెడదారిపట్టి సమస్తం నష్టపోతున్నారని పిటిషన్ దారు పేర్కొన్నారు. దీంతో ఆన్‌లైన్ రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా, అజు వర్గీస్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఇదిలావుంటే ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ కు స్వీయ-నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌ఐటిఐ ఆయోగ్ ఇటీవల సూచించింది. ఇందులో వినియోగదారుల కనీస వయస్సును 18 సంవత్సరాలకు పెంచాలని ఎన్ఐటిఐ ఆయోగ్ సూచించింది. ఫాంటసీ స్పోర్ట్స్ మాదిరిగా స్కిల్ గేమింగ్ పరిశ్రమ కూడా వివిధ రాష్ట్రాల్లోని వివిధ చట్టాలతో సమస్యను ఎదుర్కొంటుందని ఆన్‌లైన్ రమ్మీ ఫెడరేషన్ గత వారం ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే.