అమ్మాయిలు జర భద్రం.. ఆన్ లైన్ లో ఇలాంటి వాళ్ళూ ఉంటారు !

159

సోషల్ మీడియా వేదిక జరిగే మోసాలను పసిగట్టడం చాలా కష్టం.. అవతల మాట్లాడేది ఆడా, మగ అని తెలుసుకోవడం కూసింత కష్టమే.. దీనినే ఆసరాగా చేసుకున్నాడో కేటుగాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 70 మందిని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన సుమంత్, హైదరాబాద్ లోని మణికొండలో ఉంటున్నాడు. అమెజాన్ లో ఉద్యోగం చేస్తుంటాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి సోషల్ మీడియా సైట్ల మీద వాలిపోతారు. అమ్మాయిల పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వారికి దగ్గరవుతాడు. వారి పర్సనల్ డేటా మొత్తం సేకరిస్తాడు.

మెల్లిగా వారి ఫోటోలను తీసుకుంటాడు. ఆ తర్వాత మెల్లిగా లేడి ముసుగు తీసేసి అసలు రూపం బయట పెడతాడు. వేధింపులకు దిగుతాడు. రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా కృంగదీస్తాడు. ఇతడి బారినపడ్డ బాధితురాలు దైర్యం చేసి నేరుగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దింతో రంగంలోకి దిగిన సైబర్ టీం కేటుగాడిని పట్టుకొని మొత్తం కూపీ లాగారు. ఇతడి వలలో 70 మంది అమ్మాయిలు చిక్కినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా చేసుకొని అనేక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి యువతులను వేధిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఈ సందర్భంగా యువతులకు పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో పరిచయస్తులతో మాట్లాడితే మంచిదని, అనామక వ్యక్తులతో మాట్లాడి ఇబ్బంది పడవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని, ఆలా కాకుండా వారికి డబ్బు ఇవ్వడం లేదంటే వారు అడిగింది ఇవ్వడం చేయకూడదని తెలిపారు. సైబర్ టీం ఎప్పుడు అందుబాటులోనే ఉంటుందని ఎవరు భయపడవద్దని, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తమకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకుండా ఉండాలి అంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఇటువంటి సమయంలోనే యువతులు దైర్యంగా వ్యవహరించాలని, ఇటువంటి కేటుగాళ్లను పట్టించి మరికొందరు వీరి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించారు.

అమ్మాయిలు జర భద్రం.. ఆన్ లైన్ లో ఇలాంటి వాళ్ళూ ఉంటారు !