75వ స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు!

291

రాబోతే ఆగష్టు 15తో మన దేశానికి స్వతంత్రం సిద్దించి 74 వసంతాలు పూర్తిచేసుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. 75 సంవత్సరాల వేడుకను 2021 ఆగష్టు 15 నుండి 2022 ఆగష్టు 15 వరకు ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈక్రమంలోనే వేడుకల నిర్వహణకు ఒక కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో సభ్యులుగా రాష్టాల ముఖ్యమంత్రుల హోదాలో తెలుగు రాష్ట్రాల నుండి కేసీఆర్‌, జగన్‌ లకు స్థానం దక్కగా.. సీనియర్ రాజకీయ నేతగా చంద్రబాబుకు స్థానం దక్కింది. రాజకీయ పార్టీల హోదాలో సీతారాం ఏచూరి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, సినీ దర్శకులు రాజమౌళి, ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవాతోపాటు మరికొందరు తెలుగు ప్రముఖులకు చోటు దక్కింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది.

ఇక జాతీయ స్థాయిలో చూస్తే ఇందులో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్య సేన్‌, భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు దాదాపు అందరు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, సినీ ప్రముఖులు ఏఆర్‌ రెహమాన్‌, రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఇళయరాజా, కేజే ఏసుదాస్‌లూ ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు, క్రీడా రంగం నుండి పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, మిథాలీరాజ్, కొందరు పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు!