కళ్యాణ లక్ష్మిలో కానరాని మోసం

152

పేద, బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి.. పెళ్లి చేసుకున్న జంటలకు 1,00,116 రూపాయాలు అందిస్తుంది ప్రభుత్వం. కాగా ఇందులో ఫేక్ పెళ్లిళ్ల అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒకటి రెండు కాదు 90 ఫేక్ పెళ్లిళ్లు అని తేల్చారు. వీరికి చెక్కులు కూడా ఇచ్చారట. కొందరు డబ్బులు డ్రా చేసుకొని ఖర్చుకూడా పెట్టేసుకున్నారు. ఒక్క సరిగా 90 ఫేక్ పెళ్లిళ్లు వెలుగులోకి రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సుమారు కోటి రూపాయల ప్రభుత్వ ధనం వృధా కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

వివరాల్లోకి వెళితే కొత్త బట్టలు. ఓ పసుపు తాడు. లేదంటే గిల్ట్ తాళి. రెండు మూడు ఫోటోలు. అంతే. లక్ష రూపాయలొస్తయ్, ఇలా చిన్నపాటి మోసానికి లక్ష వస్తుంటే, ఫేక్ పెళ్లి చేసుకోవడం వలన వచ్చే నష్టం ఏముంది. దొరికితే దొంగ, దొరక్కపోతే నిత్యపెళ్లికొడుకు. ఇదే చందాన నడిచింది ఫేక్ పెళ్లిళ్ల దందా. ఈ 90 పెళ్లిళ్లు కూడా ఆదిలాబాద్ అర్భన్ జిల్లాలో తేలినవే. వీటిలో.. ఓ మూడు తప్పుడు అప్లికేషన్ల నుంచి డబ్బులు వసూల్ చేశారట. మరి మిగతా 87 కేసుల పరిస్థితి ఏంటి అనేది ఇంకా తేలలేదు. ఇక వారి బ్యాంకు ఖాతాలలో నగదు ఉంటే ఫ్రీజ్ చెయ్యాలని అధికారులు బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ విధంగా మోసాలు జరగడం ఇది తొలిసారి కాదు.. ఈ పథకం ప్రారంభం నుంచే ఇటువంటివి జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చాయి. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ దొంగ పెళ్లిళ్ల ఘటనలు వెలుగుచూశాయి. ఇక వాటిపై చర్యలు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియరాలేదు. కాగా దొరికినవి 90 ఉంటే దొరకని దొంగ పెళ్లిళ్లు ఎన్ని ఉన్నాయో అని అభిప్రాయపడుతున్నారు అధికారులు.