జూనియర్ రావాల్సిందే.. చంద్రబాబు ఎదుటే తమ్ముళ్ల స్లొగన్స్!

547

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కఠిన పరీక్షలను ఎదుర్కొంటుంది. అసలే భారీ ఓటమి కాగా గెలిచిన నేతలు కూడా కొందరు సైలెంట్ గా ఉండిపోతున్నారు. మరోవైపు కార్యకర్తలను సైతం అధికార పార్టీ నయానో భయానో లోగదీసుకోవాలని చూస్తుంది. తట్టుకొని నిలబడిన కార్యకర్తలు పార్టీకి బలంగా ఉంటే కొందరు అధికార పార్టీకి లొంగిపోయారు. స్థానిక ఎన్నికలలో కూడా టీడీపీ సానుభూతిపరులకు గౌరవప్రదమైన గెలుపు దక్కుతుంది కానీ టీడీపీ పెద్దలు చెప్పేంత బంపర్ విక్టరీ అయితే లేదు. స్వయంగా చంద్రబాబు సొంత గడ్డ కుప్పంలో కూడా ఓటమితో పార్టీ పెద్దలకు కాస్త కనువిప్పు కలిగింది.

దీంతో అప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటనకు ప్లాన్ చేశారు. గురువారమే జిల్లాలో అడుగుపెట్టిన బాబు శుక్రవారం కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. అయితే చంద్రబాబు రోడ్ షో శాంతిపురం వరకు రాగానే కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్‌టీఆర్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూనియర్ ఎన్‌టీఆర్‌ను తప్పకుండా కుప్పంకి తీసుకువచ్చి ప్రచారం చేయించాలని డిమాండ్ చేశారు. అయితే తమ్ముళ్ల స్లోగన్స్ విన్న చంద్రబాబు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తలూపి సైలెంట్‌గా ముందుకు కదిలారు.

తెలుగు దేశం పార్టీలో జూనియర్ ప్రస్తావన అప్పుడప్పుడూ వస్తూనే ఉంటుంది. పార్టీ నేతలు సైతం ఆ మధ్య జూనియర్ రావాల్సిందేనని బహిరంగంగానే చెప్పేశారు. అప్పుడప్పుడు జూనియర్ ఫ్లెక్షీలు సైతం పార్టీ కార్యక్రమాలలో కనిపించేవి. అయితే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు, ఎన్‌టీఆర్ కలిపి ఉన్న ప్లెక్సీలను కూడా కుప్పంలో అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కొందరు జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులు మాత్రం పాలిటిక్స్‌లోకి వెళ్ళకండంటూ, ఈ రొచ్చులో దిగి మాకు దూరం కావద్దంటూ ట్విట్టర్ ద్వారా ఎన్‌టీఆర్‌కు సూచనలు ఇస్తున్నారు.

జూనియర్ రావాల్సిందే.. చంద్రబాబు ఎదుటే తమ్ముళ్ల స్లొగన్స్!