మమ్మల్ని తెలంగాణలో కలపండి.. పక్క రాష్ట్రం నుండి డిమాండ్!

409

ఆరు దశాబ్దాలుగా మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్ర రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం జిల్లా కేంద్రం కూడా మూడు వందల కిమీ దూరంలో ఉండడంతో తాము అసలు ఈ రాష్ట్రంలో ఉన్నామో కూడా ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే మమ్మల్ని మాకు దగ్గరలోని తెలంగాణ రాష్ట్రంలో కలపండి. దయవుంచి మీరే మమల్ని పక్క రాష్ట్రంలో కలిపేలా కృషి చేయాలి. ఇది మహారాష్ట్ర సరిహద్దులోని కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు నాందేడ్ జిల్లా కలెక్టరుని కలిసి వినతి పత్రం అందించి చేసుకున్న విన్నపం.

ఇది ఇప్పటిదేం కాదు.. తమను తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాల గిరిజన రైతులు తమను పక్కరాష్ట్రమైన తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఈమేరకు కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు తాజాగా నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సాధారణంగా భాషాభిమానంతో పాటు సొంత రాష్ట్రమైన మనోభావాలు ప్రజలలో ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ తామే పక్క రాష్ట్రంలో కలుస్తామని డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఈ గిరిజన గ్రామాలు జిల్లా కేంద్రమైన నాందేడ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందువల్ల ఆయా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిజానికి ఈ గ్రామాలు 1956కు ముందు తెలంగాణలోనే ఉండేవి. తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం ప్రాంతం ఎలా ఏపీలో ఉండేదో ఈ గిరిజన గ్రామాలు సైతం తెలంగాణలో ఉండేవి. కానీ 1956లో భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల ఏర్పాటుతో ఒకే బాష మాట్లాడే గ్రామాలను ఒక రాష్ట్రంగా సవరణలు చేశారు. అప్పుడే ఆయా గ్రామాలను మహారాష్ట్రలో కలిపారు.

కానీ.. ఈ బాషా ప్రాతిపదిక రాష్ట్రంగా మేము మహారాష్ట్రలో కలిసి ఆరు దశాబ్దాలైనా అభివృద్ధి అన్న పదం ఎరుగలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయని పక్షంలో తమ గ్రామాలను తెంలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా నయ్‌గావ్‌, బోకర్‌, డెగ్లూర్‌, కిన్వట్‌, హథ్‌గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి తాము మీ రాష్ట్రంలో కలుస్తామని విన్నవించుకున్నారు. ఇప్పుడు వారి జిల్లా కలెక్టరును కలిసి అదే విన్నపం చేసుకున్నారు.

మమ్మల్ని తెలంగాణలో కలపండి.. పక్క రాష్ట్రం నుండి డిమాండ్!