అదృష్టం అందలం ఎక్కించింది – పవన్ కళ్యాణ్

346

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తిరుమలకు వెళ్లారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు పవన్.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చెయ్యబోతున్నారు అనేది విషయమై జనసేన, బీజేపీ మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. దీనికి సంబందించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పవన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని తెలిపారు. సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

“అదృష్టం అందలం ఎక్కిస్తే.. బుద్ధి బురదలోకి దిగిందన్నట్టుగా” వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ ఆస్ట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అరాచకాలను ఆపకపోతే కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని అన్నారు. మీడియాను కూడా బేరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపై వేధింపులకు దిగుతున్నారని జనసేనాని ఆరోపించారు.

మరోవైపు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 142 దేవాలయాలను ధ్వంసం చేసినట్లు పవన్ తెలిపారు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే వైసీపీ నేతలు వేళాకోళంగా మాట్లాడటం బాధకలిగించిందని పవన్ అన్నారు. దేవాలయాల మీద దాడులు చేసిన వారిని పట్టుకోకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని అన్నారు. అదే మసీద్, చర్చ్ పై జరిగితే ఇదే విధంగా ఉండేదా అని ప్రశ్నించారు జనసేనాని.